గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన’ (DDUGKY) పథకం నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యువతకు ఉద్యోగానికి పనికొచ్చే ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వకుండానే ప్రభుత్వం నుంచి నిధులు డ్రా చేసినట్టు సమాచారం. ‘సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కేంద్రంగానే కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు హైకోర్టు లేదా అత్యున్నత స్థాయి విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
నిధుల కేటాయింపులు ఇలా?
నిరుద్యోగ యువతకు స్కిల్ ట్రైనింగ్, ఉపాధి కల్పన కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.అయితే, సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వంతో ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకుని ఉపాధి శిక్షణ ఇస్తున్నది. అయితే,ఇటీవల కాలంలో ప్రాజెక్టుల పేరిట సదరు కంపెనీకి నిధులు భారీగానే అందాయి. కానీ, శిక్షణ ఎంతమందికి అందించారనే దానిపై లెక్కల్లో తేడాలు వచ్చాయి . నిధుల కేటాయింపు వివరాలు ఒక్కసారిగా పరిశీలిస్తే ..
ప్రాజెక్ట్ వన్ పేరిట 2014 నుంచి 2018 వరకు రూ.10 కోట్లు, ప్రాజెక్ట్ - 2 పేరిట 2019 నుంచి 2025 వరకు రూ.36 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్టు సమాచారం. అయితే, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో వంటి రాష్ట్రాల్లో ప్రాజెక్టులను పూర్తి చేయలేక ఈ కంపెనీ గతంలో చేతులెత్తేసింది. చివరకు ఒడిశాలోనూ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారని సమాచారం. అయినా తెలంగాణలో మాత్రం పెద్దఎత్తున నిధులు, ప్రాజెక్టులు కట్టబెట్టడం వెనుక ఎవరున్నారు? అనే దానిపై చర్చ జరుగుతోంది.
లెక్కల్లో బొక్కలు.. అధికారులు పసిగట్టలేకపోయారా?
2019 నుంచి 2025 మార్చి వరకు కేవలం 500 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చిన కంపనీ.. మార్చి 2025 నుంచి డిసెంబర్ 2025 మధ్య కేవలం 9 నెలల వ్యవధిలోనే 3,766 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు రికార్డుల్లో చూపించింది. దీని మీద సర్వత్రా అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతో మొత్తం 4,266 మంది వివరాలను మరోసారి పరిశీలంచాలని, ట్రైనింగ్ పూర్తయిందా? జాబ్స్ వచ్చాయా? అనే విషయంపై ఎంక్వయిరీ జరిపి నిజనిజాలను నిర్దారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఉపాధి కల్పనలో నిజమెంత?
సుమారు ఆరేండ్లకు పైగా కాలంలో కేవలం 2,222 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించినట్లు ఆ సంస్థ చెబుతోంది. అయితే, నిజాంగానే అంతమందికి జాబ్స్ కల్పించారా? లేదా? అనే దానిపైనా పలు అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.
మూడోసారి నిధులు ఎలా విడుదల చేశారు?
సాహితి సిస్టమ్స్ సంస్థకు ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం అర్హత లేని సమయంలో కూడా 3వ విడత నిధులు విడుదల అయినట్టు సమాచారం. అదే నిజమైతే ఏవిధంగా విడుదల చేశారు? దీని వెనుక ఉన్న ఈడీవీఎం ఉన్నతాధికారులు ఎవరు? సంబంధిత ఆదేశాలు ఎవరు ఇచ్చారు? వారికి సాహితి సంస్థకు గల ఆర్థిక లావాదేవీల సంగతి ఏంటి?అనేది తెలియాల్సి ఉంది.
స్వతంత్ర విచారణ జరపాల్సిందే..
డీడీయూజీకేవైలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల్లో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సాహితి సిస్టమ్స్ సంస్థకు సంబంధించిన శిక్షణా కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. వాటి లీజ్/రెంటల్ ఒప్పందాలు, సర్వీస్ ప్రొవైడర్ అగ్రిమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సాహితికి సంబంధించిన శిక్షణ వివరాలు, ఆర్థిక లావాదేవీలను సమగ్రంగా పరిశీలించాలని పలువురు కోరుతున్నారు. అందుకోసం స్వతంత్ర లేదా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.


