రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి జరుగుతున్న రాద్దాంతం గురించి అందరికీ తెలిసిందే.. మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఊహించనంతగా ఉపయోగించుకుంటున్నట్టు అధికారులే లెక్కలు చెబుతున్నారు. ఒకవైపు ఉచిత ప్రయాణం చేస్తున్న ఆడవారు.. పురుషులకు కేటాయించిన సీట్లను సైతం ఆక్రమిస్తూ.. డబ్బులు పెట్టి టికెట్ కొన్నవారిని సైతం ఇబ్బందులు పెడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
ఇలా సీటు విషయంలో మగవారికి ఆడవారికి వివాదాలు జరగడం సాధారణ విషయంగా మారిపోయింది. అలాగే బస్సులో ఆక్యుపెన్సీ ఫుల్ కానీ కలెక్షన్ నిల్ గా ఉండటంతో టికెట్ కు సరిపడా చిల్లర దొరక్క కూడా పలు ఇబ్బందులు తలెత్తుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి రావడం తెలిసిందే.. తాజాగా ఇదే విషయంలో జరిగిన వివాదం మహిళ కండక్టర్ ప్రాణాల మీదికి తెచ్చింది.
ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మిట్టగూడెంకు చెందిన ఓ ప్రయాణికురాలు.. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ఎక్కారు. ఆమెతో పాటు ఉన్న బాలుడికి టికెట్ తీసుకోవాలని మహిళా కండక్టర్ సూచించినట్టు తెలుస్తుంది. అయితే టికెట్ తీసుకోవడానికి నిరాకరించిన ప్రయాణికురాలు.. కండక్టర్‌తో వాగ్వాదానికి దిగారు.
అనంతరం కండక్టర్ ప్రవల్లిక ఆ మహిళకు సర్ది చెప్పడంతో బాలుడికి టికెట్ తీసుకునేందుకు అంగీకరించిన ప్రయాణికురాలు.. టికెట్ సరిపడా చిల్లర ఇవ్వకపోవడంతో గొడవ మళ్ళీ మొదలైనట్టు సమాచారం.. తాము దిగే స్టాప్ లో చిల్లర తీసుకొమ్మని కండక్టర్ చెప్పగా.. ఇప్పుడే చిల్లర ఇవ్వాలని ప్రయాణికురాలు కండక్టర్ తో గోడవకు దిగారు. ఈలోగా మిట్టగూడెం స్టాప్ రాగానే ఆ ప్రయాణికురాలు బస్సు దిగడానికి ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో మహిళా కండక్టర్ ఆమెను అదే బస్సులో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. బస్సును ముందుకు నడపాలని డ్రైవర్‌కు సూచించారు. ఈ దశలో ఆ ప్రయాణికురాలు కండక్టర్ ను నెట్టివేయడంతో కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. దీంతో ఆమె కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్టు సమాచారం.. కాగా ఈ ఘటనకు కారణమైన ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు. మరోవైపు కండక్టర్ పై జరిగిన దాడిని నిరసిస్తూ..కార్మికులు గద్వాల్ డిపోలో గేట్ ఎదుట ధర్నాచేశారు. ఉద్యోగుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.. ఘటనకు కారణమైన బాధ్యురాలిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
అలాగే ప్రయాణికురాలిని వెంటనే అరెస్టు చేసి, నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు యాజమాన్యం పటిష్ఠ చర్యలు తీసుకోవాలని నాయకులు స్పష్టం చేశారు. టికెట్, చిల్లర వంటి చిన్న విషయాల్లో వివాదాలు తలెత్తినప్పుడు ప్రయాణికులు సంయమనం పాటించాలని, సమస్యను చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు.
ఈ ధర్నాలో కొండాచారి, విజయభాస్కర్ రెడ్డి, ఆర్‌ఎన్ రెడ్డి, శ్రీధర్, పీఆర్ రెడ్డి, సంపత్ కుమార్, భీంసేన్, సీతమ్మ, ఉష, రాజసరస్వతి, కార్తీక్ రాముడు, కేఆర్ రెడ్డితో పాటు పలువురు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.


