ఎల్ నినోకు ఈశాన్య రుతుపవనాలు విరామం ప్రకటించాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమైన ప్రభుత్వాలకు ఈశాన్య రుతుపవనాలు ఊరటనిచ్చాయి. పలురాష్ట్రాల్లో భారీ వర్షాలు కరుస్తాయని ఐఎండీ ప్రకటించడంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే మున్ముందు వచ్చే కరువు పరిస్థితులకు బలి కావాల్సిందేనని ఆందోళన చెందుతున్నారు.
ఇదిలాఉండగా, తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గతవారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్నింటికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.పుదుక్కోట్టై, శివగంగై, రామనాథపురం, నాగపట్నం జిల్లాలో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగపట్నం తీర ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
తమిళనాడులోని పశ్చిమ,దక్షిణ జిల్లాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉండటంతో ముందస్తు భద్రత కోసం కోయంబత్తూరు, దిండుక్కల్, రామనాథపురం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైకల్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కుండపోత వర్షాల కారణంగా కారైకల్ పరిసరాల్లో జనజీవనం స్తంభించిపోయింది. అక్కడ కూడడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తీరప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్లను సిద్ధం చేయడంతో పాటు సహాయక బృందాలను పుదుచ్చేరి ప్రభుత్వం రంగంలోకి దించింది. ఇదిలాఉండగా, రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసింది. దక్షిణ తెలంగాణకు భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


