వియత్నాం పర్యటన ముగించుకుని వచ్చిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం యూపీలో పర్యటిస్తున్నారు. అయితే,రాహుల్ పర్యటనలో భాగంగా ఘోర ప్రమాదం సంభవించింది. ఆయన కాన్వాయ్‌లోని పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.కాన్వాయ్‌లోని 5 కార్లు, అంబులెన్స్ ఒకదానివెనుక మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడినట్టు సమాచారం. కొందరు పోలీసులకు కూడా గాయాలు అయినట్టు సమాచారం.
కాగా, కాన్వాయ్ ప్రమాదంలో రాహుల్ గాంధీ తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం. యూపీలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వాహనాల్లోని పోలీసులు, సిబ్బందిని బయటకు తీశారు.చిన్న చిన్న గాయాలతో వారంతా క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. కాగా, అమిత్‌షా పరువు నష్టం కేసులో సుల్తాన్‌పూర్ కోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ క్షేమంగా బయటపడటంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలోనే రాహుల్‌తో సోనియా, ప్రియాంకగాంధీ ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీసినట్టు సమాచారం.
‘సిట్’ దర్యాప్తునకు ఆదేశం
రాహుల్ కాన్వాయ్ ప్రమాదంపై యూపీ పోలీస్ శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. కాన్వాయ్ వెనుక ప్రయాణిస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న తీరుపై సమగ్ర విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేస్తూ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రమాదంలో రాహుల్ గాంధీ సేఫ్‌గా బయటపడ్డారు. అయినప్పటికీ కేంద్రంలోని లోక్‌సభ ప్రతిపక్ష నేత కాన్వాయ్‌కు ఈ స్థాయిలో ప్రమాదం జరగడాన్ని యోగి సర్కార్ తీవ్రంగా పరిగణించింది.కాన్వాయ్ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, అసలు ఎక్కడ లోపం జరిగిందనే అంశాలను ‘సిట్’ బృందం సమగ్రంగా పరిశీలించనుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు సమాచారం.


