రాష్ట్రంలో జరగాల్సిన ప్రభుత్వ పోటీ పరీక్షలను వాయిదా వేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.వాయిదా వేయకపోతే విద్యార్థులకు జరిగే నష్టాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఈ మేరకు సోమవారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు. విద్యార్థులు, ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు.
ఒకేసారి స్టేట్, సెంట్రల్ పరీక్షలు..
రాష్ట్రంలో ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఏ పరీక్ష రాయాలా? అని ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం. ఈ విషయం మాజీ మంత్రి హరీశ్ రావు వద్దకు చేరగా, విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. వచ్చే నెల 6న జరగాల్సిన TGPSC ఆర్ అండ్ బీ AEE పరీక్ష,కేంద్ర ప్రభుత్వం నిర్వహించే SSC JE పరీక్ష ఒకేరోజు రావడంతో 50 వేల మందికి పైగా సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ఇప్పటికే పరీక్ష తేదీని కన్ఫర్మ్ చేస్తూ వెబ్సైట్లో షెడ్యూల్ విడుదల చేసిందని, ఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏది రాయాలో, ఏది వదులుకోవాలో తేల్చుకోలేక తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే విద్యార్థులు పలుమార్లు మంత్రులకు, అధికారులకు మొరపెట్టుకున్నా, ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసుకున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని గుర్తుచేశారు.
ప్రభుత్వ బేషజాల వల్ల విద్యార్థులు ఒక విలువైన అవకాశాన్ని కోల్పోయి వారి భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉన్నందున, తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి TGPSC R&B AEE పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులందరూ రెండు పరీక్షలు రాసేలా వెసులుబాటు కల్పించి వారి భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు వెల్లడించారు.


