Rains: ఓవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు భయపెడుతున్న నీటి కొరత.. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబర్ 28న తూర్పు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అదే రోజున వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
హైదరాబాద్‌తో సహా ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందంది. అక్టోబర్ 29 నుండి నవంబర్ 3 లేదా 4వ తేదీ వరకు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో వానలు కురవనున్నాయి.


