తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయనపై నిప్పులు చెరిగారు. కేటీఆర్ ఒక ఫెయిల్డ్ లీడర్ అని.. ఆయన అసమర్థత వల్లే అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిందని ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలన అంతా అవినీతిమయమైందని విమర్శించారు.
మంచిర్యాల జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంతో చేసిన దుబారా ఖర్చులతో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందని మండిపడ్డారు.
కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి.. కాళేశ్వరం రీ-డిజైన్ పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేశారని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై తక్షణమే సిబిఐ విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేసిన అప్పులకు గానూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలోనే ఏకంగా 3 లక్షల కోట్ల రూపాయల వడ్డీ కట్టాల్సి వచ్చిందని వెల్లడించారు.
బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు వాళ్ల కళ్లముందే కూలిపోయాయని.. కానీ కాంగ్రెస్ కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టూ చెక్కుచెదరలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పదేండ్ల పాటు తుగ్లక్ పాలన సాగించారని, ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సరిగ్గా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండు లక్షల ఇండ్లను నిర్మించి ఇచ్చామని.. భవిష్యత్తులో గుడిసెలు, పెంకుటిళ్లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు.
ఇక గ్లోబల్ స్థాయిలో ఎల్ నినో ప్రభావంతో అనేక దేశాల్లో వర్షాలు లేక కరువు పరిస్థితులు వచ్చాయని, ప్రకృతి వైపరీత్యాలను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మరోవైపు టామ్‌కామ్ (TOMCOM) ద్వారా తెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి కల్పిస్తున్నామని.. జర్మన్ భాష నేర్చుకుని నైపుణ్యాలు పెంచుకున్న యువతకు ఏటా 25 లక్షల దాకా వేతనం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు.
మరోవైపు తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ హీట్ ఎక్కుతున్నాయి. ఎలాగైనా మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా రాజకీయ సమరానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ బలహీనతలను టార్గెట్ చేస్తోంది.
ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వం, పార్టీ వరుస ఓటములపై కాంగ్రెస్ నేతలు విమర్శల దాడిని పెంచుతున్నారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా ఇప్పటి నుంచే పొలిటికల్ గేమ్ మొదలైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి..












