Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ బర్తరఫ్ కొంత బాధాకరమే అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు ఉంటాయని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సురేఖ, చిన్నారెడ్డి విషయంలో ఏఐసీసీ అదే సంకేతం ఇచ్చిందన్నారు.
కొండా సురేఖ తీరు ఆక్షేపణీయంగా ఉన్నందునే ఆమెపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగానే హైకమాండ్ చర్యలు తీసుకుందని వివరించారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని కొండా సురేఖ చెప్పారన్న మహేశ్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ లో కంటిన్యూ అయితే ఆమెకు కచ్చితంగా అవకాశం ఇస్తామన్నారు. నిన్న కొండా సురేఖ కొంత ఆవేశం, ఆవేదనతో మాట్లాడారన్న మహేశ్ కుమార్ గౌడ్.. ఇకపై కొండా సురేఖ అలా మాట్లాడకూడదని సూచించారు.
కాంగ్రెస్ లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా బాధ ఉన్నా.. చెప్పుకోవడానికి పార్టీలో అనేక వేదికలు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా నేరుగా పీసీసీ అధ్యక్షుడి వద్దకు వచ్చి తమ సమస్యలు, ఇబ్బందులు, బాధలు చెప్పుకోవచ్చన్నారు. ఏఐసీసీ ఇంఛార్జ్, జనరల్ సెక్రటరీ, అధిష్టానాన్ని కూడా కలవొచ్చని తమ ఆవేదనను, ఇబ్బందులను నేతలు చెప్పుకోవచ్చన్నారు. కానీ బాహాటంగా, ఇష్టారాజ్యంగా మాట్లాడతామంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదని తేల్చి చెప్పారు. అది క్షమించరాని తప్పు అన్నారు మహేశ్ గౌడ్.
పార్టీలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉన్నట్లే.. క్రమశిక్షణ విషయంలో అంతే కఠినంగా ఉంటుందన్నారు. క్రమశిక్షణ చర్యల విషయంలో కులాలు, మతాలు, ప్రాంతాలను చూడమన్నారు. ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి రేవంత్ కు లేదన్నారు మహేశ్ గౌడ్. భవిష్యత్ లో బీసీలకు పెద్ద పీట వేసే ఆలోచన హైకమాండ్ కు ఉందని మహేశ్ గౌడ్ తెలిపారు.
కొండా సురేఖ మాట్లాడిన తీరు కొంత ఆక్షేపణీయంగా ఉంది కాబట్టే చర్యలు తీసుకున్నారు. కొండా సురేఖ కొంత ఆవేదన, ఆవేశంతో మాట్లాడారు. ఇక ముందు అలా మాట్లాడకూడదని నేను సూచిస్తున్నా. సురేఖ మాత్రమే కాదు కాంగ్రెస్ లో ఎవరైనా ఏదైనా ఇబ్బంది, సమస్య ఉంటే మాట్లాడేందుకు పార్టీలో రకరకాల వేదికలు ఉన్నాయి. నేరుగా పీసీసీ అధ్యక్షుడికి వచ్చి చెప్పుకోవచ్చు. ఏఐసీసీ ఇంచార్జ్ కి చెప్పుకోవచ్చు. అక్కడ తృప్తి చెందకుంటే జనరల్ సెక్రటరీ ఆర్గనైజర్ ఉన్నారు. అక్కడా కాకుంటే ఖర్గే, రాహుల్ ని కలవొచ్చు. ఏదైనా ఆవేదన, బాధ ఉంటే చెప్పుకోవచ్చు. కానీ, బాహాటంగా ఇష్టారాజ్యాంగా బయట మాట్లాడతాం అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు.
కాంగ్రెస్ లో ఎంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఉంటుందో క్రమశిక్షణ విషయంలో అంతే కఠినంగా ఉంటుంది. ఆ సంకేతం నిన్న ఇచ్చారు. కొండా సురేఖ బర్తరఫ్ కొంత బాధాకరం. ఆమె మా సోదరీమణి. భవిష్యత్తులో కూడా ఇక ఏ విషయంలోనూ మాట్లాడొద్దని ఆమెకు సూచిస్తున్నా. వారే కాదు ఏ కాంగ్రెస్ నాయకుడైనా హద్దులు దాటి మాట్లాడితే ఇలాంటి చర్యలు ఉంటాయనే మాట గుర్తు పెట్టుకోవాలి.
కొన్ని సందర్భాల్లో కొన్ని హద్దులు దాటినప్పుడు ఆపే పరిస్థితులు ఉండవు. గతంలో రెండుసార్లు కొండా సురేఖను కాపాడా. ఆమె వల్ల ఇబ్బందులు అయినప్పుడు పార్టీ, ముఖ్యమంత్రికి నచ్చజెప్పి చర్యలు తీసుకోకుండా చూశా. ఈసారి కొంత హద్దు మీరిందని క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం దాన్ని ఏఐసీసీ పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందేనని నిర్ణయించడం వల్ల బర్తరఫ్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ లో క్రమశిక్షణ విషయానికి వస్తే కులం, మతం, ప్రాంతం చూసే అవకాశం లేదు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంత పెద్ద వారైనా కఠినమైన నిర్ణయం ఉంటుందనే మాట నిన్న ఖర్గే స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై ఓపెన్ గా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు. ఆయన అసెంబ్లీకి రావాలి. ప్రజలు వారికి ప్రతిపక్ష పాత్ర ఇచ్చి ఆదరించారు. అసెంబ్లీకి వచ్చి మీ అనుభవాన్ని పంచుకోండి, మీ వాదనలు వినిపించండి. ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోతే ప్రజలు మీకిచ్చిన హోదాకు అర్థం లేకుండా పోతోంది.
పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. 8లక్షల కోట్ల పైచిలుకు అప్పులు మా నెత్తిన పెట్టి పోయారు. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా పద్దతి ప్రకారం అభివృద్ధి, సంక్షేమం అందిస్తున్నాం. పేదలకు సన్నబియ్యం బియ్యం, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ, రైతుభరోసా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం. రుణమాఫీ చేశాం. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. విద్య వైద్యపరంగా విపరీతమైన అభివృద్ధి జరుగుతోంది'' అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.







