మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌కు గురైన కొండా సురేఖ వరుసగా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మీడియాకు సైతం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక ఆమె కొంతకాలం పాటు మౌనంగా ఉండిపోతారని అంతా భావించారు. కానీ, అందుకు భిన్నంగా కొండా సురేఖ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పదవి పోయినందుకు బాధగా ఉన్నా దానిని ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ సోషల్ మీడియా (ఫేస్‌బుక్)లో ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘ఇక నిరీక్షణ ముగిసింది’ రాసుకొచ్చారు.త్వరలోనే బిగ్ అప్డేట్ ఉంటుందని, తెలంగాణ వేచి చూడాలని పేర్కొన్నారు. అయితే, ముందస్తు సమాచారం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా పదవి నుంచి తొలగించడంతో కొండా సురేఖ తీవ్రంగా హర్ట్ అయినట్టు తెలిసింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది..
మాజీ మంత్రి ఎలాంటి ప్రకటన చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.నిన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆమె చెప్పబోయే విషయం పార్టీ మార్పునకు సంబంధించిందా? లేదా ప్రభుత్వంలోని అవినీతి మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టా విప్పుతుందా? రేవంత్ సర్కార్ మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.
https://x.com/TeluguScribe/status/2095769938107703348?s=20
కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయని మంత్రి పదవి నుంచి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి తప్పించగా.. బర్తరఫ్ ప్రకటన వెలువడిన కాసేపటికే ఆమె మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని, సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రి పొంగులేటి, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి,తిరుపతి రెడ్డి నాపై కుట్ర చేసి మంత్రి పదవి నుంచి తప్పించారని ఆరోపించారు.కేబినెట్‌లోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వారి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇదిలాఉండగా, కొండా సురేఖ పార్టీ మారే విషయంలో మనసు మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఆమె బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.









