పసిడి ధరలు దోబూచులాడుతున్నాయి. ఓ రోజు పెరగడం, మరోసారి తగ్గడం జరుగుతోంది. వినియోగదారులు సైతం ధరలు తగ్గినప్పుడు చూద్దాంలే అని అనుకునేలోపు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశవ్యాప్తంగా బంగారానికి భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. శుభాకార్యల సమయం కావడంతో ధరలు ఎక్కువైనా బంగారం కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఫలితంగా డిమాండ్‌కు తగ్గ సప్లయ్ లేకపోవడం వల్లే పసిడి ధరలు పెరుగుతున్నట్టు సమాచారం.
ఇదిలాఉండగా, గత వారం రోజులు బంగారం ధరలు తగ్గడం, పెరగడం జరుగుతోంది. అయితే, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం కూడా బంగారం ధరలు పైపైకి దూసుకెళ్లాయి. తాజాగా పెరిగిన ధర ప్రకారం.. 24 క్యారెట్స్ స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజే రూ.1,310 మేర పెరిగి రూ.1,56,660 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఆభరణాల తయారీలో అధికంగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,200 ఎగబాకి ప్రస్తుతం రూ.1,43,600 వద్ద సేల్ అవుతోంది.
గడిచిన రెండు రోజుల్లోనే 10 గ్రాముల పసిడిపై రూ.4,640 వరకు ధర పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.లక్షలు వెచ్చిస్తున్నా పెద్ద మొత్తంలో ఆశించిన మేర బంగారం రావడం లేదని వాపోతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, కరెన్సీ విలువలో మార్పులు, పెరిగిన డిమాండ్ కారణంగానే దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ తర్వాత వరుసగా హిందూ పండుగలు వస్తున్నందున మరోసారి బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం లేకపోలేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







