బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురించి మాజీ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మంత్రి పదవి నుంచి ఆమెను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడంతో పలు మీడియా సంస్థలకు వరుస ఇంటర్య్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన సురేఖ.. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో జరిగిన రాజకీయ అనుభవాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ మీతో ఎలా ఉన్నారని ప్రశ్నించగా.. ఆయన చాలా మంచోడని సురేఖ పేర్కొన్నారు. ఎప్పుడైనా మంచిగా రిసీవ్ చేసుకునేవారని, చాలా హుందాగా వ్యవహరించేవారని వెల్లడించారు. ఎప్పుడు వెళ్లినా తమను ఎంతో గౌరవించారని, తమకు కేసీఆర్‌తో ఎప్పుడూ విభేదాలు రాలేదని స్పష్టంచేశారు.
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సమయంలో తాము అడిగిన వెంటనే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని చెప్పారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కడియం శ్రీహరి మరికొందరు నాయకులు ఉన్నారని గుర్తుచేశారు. వారంతా కొండా మురళికి ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని, కానీ అందరి నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు.దాంతో కొండా మురళి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారని చెప్పారు.
కొండా సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి. ముందస్తు సమాచారం లేకుండా మంత్రి పదవి నుంచి తనను బర్తరఫ్ చేశారని, కనీసం తన వెర్షన్ కూడా వినలేదని నిన్న ఆవేదన వ్యక్తం చేసిన సురేఖ..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. మంత్రి పదవి నుంచి తీసేయకముందు సురేఖ భర్త కొండా మురళి కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు.తమ భవిష్యత్ రాజకీయాలపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కొండా సురేఖ పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, కేసీఆర్ మీద సురేఖ సాఫ్ట్ కార్నర్‌తో కామెంట్స్ చేయడంతో ఆమె తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతుందా? అని ప్రచారం జోరందుకుంది.








