గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ వెయిట్‌లిఫ్టర్ వల్లూరి అజయ్ బాబు రజత పతకంతో మెరిశాడు. పురుషుల 79 కేజీల విభాగంలో ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.
ఈ పోటీలో అజయ్ బాబుకు, మలేషియా క్రీడాకారుడు ఎర్రీ హిదాయత్ మహమ్మద్‌కు మధ్య హోరాహోరీ పోరు సాగింది. స్నాచ్ విభాగంలో 149 కిలోలు ఎత్తి సరికొత్త కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పిన అజయ్, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో 181 కిలోలు ఎత్తాడు. దీంతో మొత్తం 330 కిలోల బరువుతో స్వర్ణం ఖాయమనుకున్న తరుణంలో, మలేషియా లిఫ్టర్ తన చివరి ప్రయత్నంలో మొత్తం 331 కిలోలు ఎత్తి విజేతగా నిలిచాడు. ఫలితంగా కేవలం ఒక్క కిలో తేడాతో అజయ్‌కు రజతం దక్కగా, ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్ ముర్రే (325 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ పతకంతో అజయ్ బాబు తన కుటుంబ వారసత్వాన్ని మరింత ఘనంగా నిలబెట్టాడు. సరిగ్గా 16 ఏళ్ల క్రితం (2010 ఢిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో) ఆయన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు 56 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలుపొందారు. విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్, తన తొలి గురువైన తండ్రి సాధించిన కాంస్యాన్ని ఇప్పుడు రజతంగా మెరుగుపరిచి 'తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకున్నాడు.












