‘హైడ్రాకు సంపన్నులు కనిపించరా?’ పేరుతో స్వేచ్ఛ కథనం
జూబ్లీహిల్స్ సొసైటీ చాటున జరిగిన కబ్జాలపై స్టోరీ
ఇంతవరకూ చర్యలు తీసుకున్నది శూన్యం
కూకట్ పల్లి ఐడీఎల్ ల్యాండ్స్ వ్యవహారాలు
నాచారంలో చెరువులు, రోడ్ల మాయం
నార్సింగిలో ఎస్ఆర్ఆర్ రియల్టీ కబ్జాలపై అనేక కథనాలు
అయినా మౌనం దేనికి?.. హైడ్రా కొందరికేనా?
హైకోర్టు మొట్టికాయలతో అప్పీల్ ఆలోచనలో ప్రభుత్వం?
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809
హైడ్రా అంటే రంగనాథ్.. రేవంత్ అంటే హైడ్రా రెండేళ్ల నుంచి తెలంగాణ అంతటా ఇదే తంతు. పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా ఇవే మాటలు. నిజానికి హైడ్రా ఆలోచన మంచికే అయినా దాని వెనుక వ్యక్తిగత స్వార్థం కూడా అధికంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. కొందరిపై క్షణాల్లోనే చర్యలు తీసుకునే కమిషనర్ రంగనాథ్, బడా బాబుల జోలికి వెళ్లరనే ఆరోపణలూ లేకపోలేదు. నిత్యం వివాదాలతో హైప్ క్రియేట్ అయింది. చివరకు 63 కోర్టు ధిక్కరణలు కేసులు నమోదయ్యాయి. ఈ రెండేళ్లు హైడ్రాకు ఎన్నో సవాళ్లు, ఎన్నో విమర్శలు, ఎన్నో ప్రతిఘటనలు ఎదురయ్యాయి. అలాంటి హైడ్రాకు హైకోర్టు ఫుల్ స్టాప్ పెట్టనుందని తాజా తీర్పుతో ప్రచారం మొదలైంది.
అప్పీల్ ఆలోచనలో ప్రభుత్వం
లోతుకుంట భూముల విషయంలో హైడ్రా కమిషనర్ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పబట్టింది. ఎన్నిసార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడతారని చివాట్లు పెట్టింది. పిటిషనర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనేది రంగనాథ్ వాదన. ఈ వ్యవహారంలో ప్రభుత్వం మాత్రం అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్‌కు వెళ్లడంపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
హైడ్రాపై మిశ్రమ స్పందన.. అవినీతి ఆరోపణలు
హైడ్రా చర్యలు మొదలైనప్పుడు తీవ్ర విమర్శలు వచ్చాయి. పేదల ఇళ్లను కూల్చేస్తోందని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయినా కూడా రంగనాథ్ మొండిగా ముందుకెళ్లారు. ఈ క్రమంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. చాలామంది అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వడం, బడాబాబులను పట్టించుకోకపోవడం, ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డారనే విమర్శలు క్షేత్రస్థాయిలో ఉన్నాయి. రంగనాథ్ కూడా ఈ విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించారనే ప్రచారం జరిగింది.
స్వేచ్ఛ కథనాలు ఆగవు
ప్రభుత్వ భూములను, చెరువులను, రోడ్లను కబ్జాలు చేస్తూ బడా కంపెనీలు దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నాయి. వీటిపై స్వేచ్ఛ అనేక కథనాలు ప్రచురించింది. కూకట్ పల్లి ఐడీఎల్ ల్యాండ్స్ వ్యవహారాలు, నాచారంలో చెరువులు, రోడ్ల మాయం, నార్సింగిలో ఎస్ఆర్ఆర్ రియల్టీ కబ్జాలపై అనేక కథనాలు ఇచ్చింది. మిగిలిన ఇష్యూలపై చూపిన హైడ్రా చొరవ వీటిపై లేదు. ఇష్టారీతిన జరుగుతున్న నిర్మాణాలపై దృష్టి పెట్టింది లేదు. వ్యవస్థను వ్యక్తుల వైపు మళ్లించిన హైడ్రా తీరుపై నిత్యం స్వేచ్ఛ కథనాలు ఇస్తూనే ఉంటుంది. సంపన్నులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తూనే ఉంటుంది.












