ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల ఆస్తులు కాపాడాను
వాటిని కాపాడే క్రమంలో కక్షతో చాలామంది నాపై కేసులు పెట్టారు
లోతుకుంటలో రూ.10వేల కోట్ల భూమి కబ్జాకు ప్లాన్
రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నా.. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నా
హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రియాక్షన్
స్వేచ్ఛ న్యూస్, హైదరాబాద్
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నానని తెలిపారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నానని వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగిందన్నారు. మార్కెట్‌లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు) ఉంటుందన్నారు. ల్యాండ్ మాఫియా, కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. శాంతా శ్రీరామ్ కంపెనీ రూ.10వేల కోట్ల విలువైన లోతుకుంట భూమిని కొట్టేయాలని చూసిందని ఆరోపించారు. 6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని తెలిపారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ రెండు సంవత్సరాలలో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించిందని వెల్లడించారు.
నిజం వైపు నిజాయితీగా..
‘‘నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10 వేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయడం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మకుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసినది ఇంకొకరు. సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్ రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్ ను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణీ అవుతూ రూ.వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం వీరందరికీ హైడ్రా కమిషనర్‌గా అడ్డుపడడడమే నేను చేసిన తప్పు’’ అని రంగనాథ్ వ్యాఖ్యానించారు. తన మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు వీళ్లందరూ వేసినవేనని వివరించారు. వాటిని తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని పేర్కొన్నారు. తనకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం ఉందని, ప్రభుత్వాలు తనకు గతంలో, ఇప్పుడు, మున్ముందు ఏ బాధ్యతలు అప్పగించినా 100% ఫలితాలు ఇవ్వడానికి పని చేశానని, ఇప్పుడు కూడా చేస్తున్నానని రంగనాథ్ తెలిపారు.












