భగవంతుడిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయంలోని మూలవిరాట్‌ను దర్శించుకున్న తర్వాత భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. అయితే.. చాలామందికి తీర్థం, ప్రసాదాలను ఎలా స్వీకరించాలో పూర్తిగా తెలియదు.
కొందరు తీర్థం తీసుకున్న తర్వాత.. ఆ చేతిని తలపై రుద్దుకుంటారు. మరికొందరు ప్రసాదాన్ని మొత్తం ఒకేసారి నోట్లో వేసుకుంటారు. అయితే.. ఇలా చేయడం ఆచారానికి విరుద్ధమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మరి.. ఆలయంలో తీర్థప్రసాదాలను ఎలా స్వీకరించాలి?
తీర్థం తీసుకునే సమయంలో.. పురుషులు తమ భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను.. మహిళలు చున్నీ లేదా చీర పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చేలా వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
ఆ తర్వాత.. ఎడమ చేతిపై కుడి చేతిని ఉంచి.. బొటనవేలు, మధ్యవేలు చివరి భాగాలను ఆనించి గట్టిగా పట్టుకోవాలి. చూపుడు వేలును బొటనవేలు పైకి మడిచి.. ఆ విధంగా తీర్థాన్ని స్వీకరించాలని పండితులు చెబుతున్నారు. తీర్థాన్ని తీసుకున్న వెంటనే.. కళ్లకు అద్దుకుని.. భగవంతుడిని స్మరిస్తూ.. శబ్దం చేయకుండా ఓం అచ్యుతాయ నమః.. ఓం అనంతాయ నమః.. ఓం గోవిందాయ నమః అని మనసులో స్మరించుకుంటూ తీర్థాన్ని సేవించాలని పండితులు చెబుతున్నారు.
ఇక ప్రసాదాన్ని స్వీకరించే సమయంలోనూ ఇదే విధంగా చేతులను ఉంచి.. కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకోవాలి. ప్రసాదాన్ని ఒకేసారి నోట్లో వేసుకోకుండా.. భక్తి భావంతో కొద్దికొద్దిగా స్వీకరించాలంటున్నారు. ఎందుకంటే.. తీర్థప్రసాదాలు కేవలం ఆహారం కాదు.. భగవంతుడి అనుగ్రహంగా భావిస్తారు. అందుకే వాటిని భక్తి, వినయం, శ్రద్ధతో స్వీకరించడం మన సంప్రదాయంలో ముఖ్యమైన ఆచారంగా పండితులు చెబుతారు..
ఇక మన హిందూ సాంప్రదాయాలు, ఆచారాలు కేవలం నమ్మకాల సమాహారం కాదు.. తరతరాలుగా మన పూర్వీకులు అందించిన జీవన విజ్ఞానం. మనం ఆచరిస్తున్న ప్రతి పద్ధతి వెనుక ఒక ఆధ్యాత్మిక భావనతో పాటు.. మనసుకు, శరీరానికి, సమాజానికి సంబంధించిన లోతైన అర్థం దాగి ఉంటుంది. అందుకే.. మన సంప్రదాయాల్లోని చాలా విషయాలు ఇప్పటికీ సైన్స్ కు సైతం అందని రహస్యాలుగా మిగిలిపోయాయి. కాలం మారినా.. తరాలు మారినా.. మన సంస్కృతి మనకు అందిస్తున్న సందేశం ఒక్కటే.. సంప్రదాయాన్ని అర్థం చేసుకుని ఆచరించండి.. ఎందుకంటే మన పూర్వీకుల జ్ఞానం.. మన ఊహకు, మన విజ్ఞానానికి అందనంత లోతైనది..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంకేతిక సమాచారం. సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలని మనవి..












