HYDRAA: లోతుకుంట భూముల విషయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. రంగనాథ్ పై 60కి పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్లు నమోదయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆయనను హైడ్రా కమిషనర్ గా తొలగించాలని సీఎస్ కు ఆదేశాలు ఇచ్చింది కోర్టు. ఈ ఆదేశాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు.
తాను రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నానని తెలిపారు. చెరువులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నానని వివరించారు. ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగిందన్నారు. మార్కెట్ లో వీటి విలువ రూ. 1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు) ఉంటుందన్నారు. ల్యాండ్ మాఫియా, కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. శాంతా శ్రీరామ్ కంపెనీ 10వేల కోట్ల విలువైన లోతుకుంట భూమిని కొట్టేయాలని చూసిందని రంగనాథ్ ఆరోపించారు.
6 చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని తెలిపారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ రెండు సంవత్సరాలలో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించిందని వెల్లడించారు.
నిజంవైపు నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయంలో దాదాపు 10 వేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది.
Save the Rocks Society, పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉండాల్సిన లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయటం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మకుంట చెరువును మింగేయాలని చూసిన ఒకడు, లోతుకుంటలో రూ. వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకడు.
సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న ఒక సంధ్యా శ్రీధర్ రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్ ను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ రూ. వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్ గా అడ్డుపడడటమే నేను చేసిన తప్పు.
వీళ్ళందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు. వాటిని నేను చట్టపరంగానే ఎదుర్కొంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. ప్రభుత్వాలు నాకు గతంలో, ఇప్పుడు, మున్ముందు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుండి 100% ఫలితాలు ఇవ్వటానికి పని చేస్తున్నాను, చేస్తాను'' అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.












