Diya Inside Train: ట్రైన్ లో ప్రయాణం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ అధికారులు కొన్ని ప్రమాదకర వస్తువులపై నిషేధం విధించారు. క్రాకర్స్ (బాణసంచా), గ్యాస్ స్టవ్‌లు, సిలిండర్లు, పెట్రోల్, కిరోసిన్, ఆమ్లాలు (యాసిడ్స్), తీవ్రమైన వాసన వచ్చే లేదా మంటలు అంటుకునే రసాయనాలు రైల్లో తీసుకెళ్లడం పూర్తిగా చట్టవిరుద్ధం. కనీసం అగ్గిపెట్టె కూడా వెంట తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదు. అలా కాదని ఈ ప్రమాదకర వస్తువులను ఎవరైనా ప్రయాణికులు రైలు ప్రయాణంలో తమ వెంట తీసుకెళితే వారిని అరెస్ట్ చేసి జైల్లోకి వేస్తారు.
చట్ట విరుద్ధం అని తెలిసినా కొందరు ప్రయాణికులు పెడ చెవిన పెడుతున్నారు. ప్రమాదకర వస్తువులు వెంట తీసుకెళ్లి తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఓ ట్రైన్ ఏసీ కోచ్ లో ఓ ప్రయాణికుడు చేసిన పని అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా.. ఏసీ కోచ్ లో దీపం వెలిగించి పూజలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ ప్రయాణికుడు అప్పర్ బెర్త్ పై కూర్చుని ఉన్నాడు. నూనె దీపం, అగరబత్తీలు వెలిగించాడు. ఆ తర్వాత పూజలు చేయడం ప్రారంభించాడు. రైల్లో ఇలా మంట పెట్టడం నిషేధం, పైగా చాలా ప్రమాదకరం. అయినా అతడు బేఖాతరు చేశాడు. ఇది గమనించిన తోటి ప్రయాణికుడు బిత్తరపోయాడు. పూజలు చేస్తున్న వ్యక్తిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు, చాలా ప్రమాదకరం అని అతడితో చెప్పాడు. మీరు తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇది కరెక్ట్ కాదని ఆ వ్యక్తిని వారించాడు. ఊహించని విధంగా ప్రమాదం జరిగి మంటలు చెలరేగితే వందలాది మంది ప్రయాణికులు చనిపోయే రిస్క్ ఉందన్నాడు. వెంటనే మీరు చేస్తున్న పనిని ఆపేయండి అని ఆ వ్యక్తిని పదే పదే రిక్వెస్ట్ చేయడం ఆ వీడియోలో ఉంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. రైళ్లలో ఏసీ కోచ్‌లలో ఉండే సింథటిక్ పరుపులు, కర్టెన్లు అత్యంత మండే స్వభావం కలిగి ఉంటాయి. ఇవి ఏ చిన్న మంటనైనా పెద్ద అగ్ని ప్రమాదంగా మారుస్తాయి. అందుకే మండే స్వభావం ఉన్న వస్తువులను వెంట తీసుకెళ్లడంపై నిషేధం విధించారు.
ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి..












