E20 Janta Party: కాక్రోచ్ జనతా పార్టీ.. ఆన్‌లైన్‌లో పురుడుపోసుకున్న ఈ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో యువతకు మద్దతుగా సీజేపీ చేపట్టిన ఆందోళనలు ఏకంగా ప్రభుత్వాన్నే షేక్ చేశాయి. బొద్దింకల దెబ్బకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. సీజేపీ రాజేసిన సెగతో ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయకతప్పలేదు. నీట్ పేపర్ లీక్ అంశం, సీజేఐ సూర్యకాంత్ కాక్రోచ్ కామెంట్స్ తో ఆన్ లైన్ లో మొదలైన సీజేపీ.. చాలా తక్కువ సమయంలోనే యువత ఆదరణ పొందింది. అలా ఈ ఆన్ లైన్ ప్రొటెస్ట్ కొద్దిరోజుల్లోనే జంతర్ మంతర్ కేంద్రంగా ఉద్యమంగా అవతరించి సూపర్ సక్సెస్ అయ్యింది.
సీజేపీ ఇచ్చిన స్పూర్తితో ఆన్ లైన్ వేదికగా కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సీజేపీ తరహాలో E20 జనతా పార్టీ పేరుతో కొత్త సోషల్ మీడియా ఖాతా ప్రారంభమైంది. సీజేపీ ఎలా అయితే విద్యార్థుల తరపున పోరాటం చేసిందో, అదే విధంగా వాహనదారుల హక్కుల కోసం మేము పోరాటం చేస్తామంటోంది. పెట్రోల్‌లో 20శాతం ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంజిన్లు పాడవుతున్నాయని, మైలేజ్ తగ్గి వాహనదారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందన్నది ఈ పార్టీ ప్రధాన ఆరోపణ. నీట్ పేపర్ లీక్‌పై సీజేపీ ఏ విధంగా ఉద్యమించిందో అదే తరహాలో E-20 ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యుయల్‌కు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తామంటోంది.
రాయితీ ధరలో 100% స్వచ్ఛమైన ఇంధనాన్ని ఎంచుకునే హక్కు, స్వేచ్ఛ వాహనదారులకు ఉండాలన్నది ఈ పార్టీ ప్రధాన డిమాండ్. అదే సమయంలో E20 ఇంధనం విషయంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఈ కొత్త పార్టీ టార్గెట్ చేసింది. నితిన్ గడ్కరీ రాజీనామా చేయాల్సిందేనని పట్టుబడుతోంది. E20 జనతా పార్టీకి సోషల్ మీడియాలో ఫాలోవర్లు క్రమంగా పెరుగుతున్నారు. ఎక్స్ లో వేలాది మంది, ఇన్ స్టాలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇంకా క్రమంగా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. సీజేపీ విజయం తర్వాత ఈ20 పార్టీ ఆవిర్భావం ప్రాముఖ్యతను సంతరించుకుంది.












