దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపులేకుండా పోతుంది. సైబర్ క్రిమినల్స్ దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి ఎన్ని చర్యలు చేపడుతున్న సామాన్యులే కాదు.. హై ఫ్రొఫైల్ ఉన్న వారితో పాటు.. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వారిబారిన పడటం ఆందోళన కలిగించే అంశంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా హ్యాకింగ్ గురైనట్లు తెలుస్తుంది.
గ్రూప్ బ్యాంకు సిస్టమ్‌లను హ్యాక్ చేసి, ఏకంగా 1 టెరాబైట్ (1TB) డేటాను డార్క్ వెబ్‌లో ఒక హ్యాకర్ ఫ్రీగా లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో కస్టమర్ల పర్సనల్ వివరాలతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న వేల మంది కస్టమర్ల ఆధార్ నంబర్లు, పేర్లు, ఫోన్ నంబర్లు ఇంకా లోన్ వివరాలు బయటికి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా లీక్ వ్యవహారంపై బ్యాంకు అధికారికంగా స్పందించింది.
తమ కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలు హ్యాక్ కాలేదని స్పష్టం చేసింది. ఒక ఉద్యోగికి చెందిన ఈమెయిల్ ఖాతా అనధికారికంగా యాక్సెస్ కావడం వల్లే కొంత సమాచారానికి హ్యాకర్లకు యాక్సెస్ లభించినట్లు తెలిపింది. ఈ ఘటనను గుర్తించిన వెంటనే భద్రతా చర్యలు చేపట్టామని బ్యాంకు వెల్లడించింది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ నిపుణులతో ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
కస్టమర్ల డేటా భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని బ్యాంక్ స్పష్టం చేసింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన కొన్ని డేటా నమూనాలను క్యాష్‌లెస్ కన్స్యూమర్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ లక్ష్మణన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్ వివరాలతో పాటు పేర్లు, ఆధార్ నంబర్లు, వ్యక్తిగత మరియు కార్పొరేట్ బ్యాంకింగ్ సమాచారం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా.. వివిధ శాఖలకు సంబంధించిన లోన్ అప్లికేషన్లు, ఆడిట్ పత్రాలు, ఎన్‌ఆర్‌ఐ కస్టమర్లకు సంబంధించిన సమాచారం, ఏటీఎంలు, బ్యాంకు శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా లీక్ అయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఈ సైబర్ దాడి పై ఇప్పటి వరకు ఏ హ్యాకర్ గ్రూప్.. అధికారికంగా ప్రకటించలేదు. అయితే, గతంలో ఇండోనేషియాలోని ఓ బ్యాంకుపై దాడికి పాల్పడినట్లు చెప్పుకున్న ట్రిపుల్‌ఎక్స్ అనే గ్రూప్ ప్రమేయం ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు.
బ్యాంకింగ్ సిస్టమ్స్ సురక్షితంగానే ఉన్నాయని బ్యాంక్ చెబుతున్నప్పటికీ.. కస్టమర్ల వ్యక్తిగత సమాచారం, ఆధార్ వివరాలు బయటకు వెళ్లినట్లు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఫోరెన్సిక్ దర్యాప్తు పూర్తయిన తర్వాతే.. అసలు ఎంత మేర డేటా లీక్ అయింది? ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? అన్న విషయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.












