కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రపంచాన్ని వణికించిన రోజులు గుర్తుకొస్తాయి. వైరస్ వ్యాప్తి మొదలైనప్పుడు.. ఆసుపత్రుల ముందు క్యూలు, ఆక్సిజన్ కోసం ఆందోళనలు, లాక్‌డౌన్‌లు, మాస్కులు.. ఇలా ఎన్నో చేదు అనుభవాలను ప్రపంచం చవిచూసింది. కరోనా తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకున్న సమయంలో.. ఇప్పుడు మరోసారి ఈ వైరస్ కలకలం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో రాష్ట్రంలోనే తొలి కరోనా కేసు నమోదైంది. తిరుపతి అర్బన్ ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. జూలై 23న నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా ఉన్నట్లు తేలింది.
అయితే కుటుంబ సభ్యులకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ లక్షణాలు కనిపించలేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే ఏపీలో మరో పది మందికి పైగా కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం 24 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం..
మరోవైపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ ఒక్కో కేసు వెలుగుచూసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో నలుగురు మృతి చెందినట్లు వైద్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసులను చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ నిర్లక్ష్యం మాత్రం చేయకూడదని హెచ్చరిస్తున్నారు.
గతంలో కరోనా వ్యాప్తి చిన్న స్థాయి కేసుల నుంచి భారీ సంక్షోభంగా మారినట్టు గుర్తు చేస్తున్నారు.. అందుకే జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని, చేతుల పరిశుభ్రత, దగ్గు-తుమ్ముల సమయంలో జాగ్రత్తలు, అవసరమైన సందర్భాల్లో మాస్క్ వినియోగం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.












