ఉదయం నిద్ర లేవగానే చాలామందికి గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. కానీ రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి కెఫీన్ ఒక్కటే మార్గం కాదు. మరి టీకి బదులుగా ఉదయం ఏం తీసుకుంటే శరీరానికి ఆరోగ్యం.. ఉత్సాహం లభిస్తాయి?
మొదటిది.. గోరువెచ్చని నీరు. నిద్ర లేచిన తర్వాత శరీరానికి నీరు అవసరం ఉంటుంది. ఉదయం నీరు తాగడం వల్ల శరీర హైడ్రేషన్ మెరుగుపడుతుంది. అయితే కేవలం గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయనే వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. మన శరీరంలోని కాలేయం, మూత్రపిండాలే ఈ పనిని సహజంగా చేస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
రెండోది.. నిమ్మరసం కలిపిన నీరు. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అయితే నిమ్మరసం కొవ్వును కరిగిస్తుంది, డిటాక్స్ చేస్తుంది అనే ప్రచారాన్ని పూర్తిగా నమ్మకండి. ఇది ఆరోగ్యకరమైన పానీయం మాత్రమే.. అద్భుతమైన బరువు తగ్గించే మందు కాదని చెబుతున్నారు.
మూడోది.. గ్రీన్ టీ. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, ముఖ్యంగా కాటెచిన్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే ఎక్కువగా తాగడం వల్ల కెఫీన్ కారణంగా కొందరికి నిద్రలేమి లేదా అసౌకర్యం కలగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇక నాలుగోది.. మజ్జిగ. ముఖ్యంగా వేడి వాతావరణంలో ఇది శరీరానికి ద్రవాలు అందించడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి.
ఇక ఉదయం శరీరానికి శక్తి కావాలంటే.. కేవలం పానీయాలపై ఆధారపడకుండా సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఓట్స్, పండ్లు, గుడ్లు, పప్పులు లేదా ఇతర ప్రోటీన్ ఉన్న ఆహారం ఎక్కువసేపు శక్తిని అందించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది.. టీ లేదా కాఫీ పూర్తిగా చెడ్డవి కావు. అయితే ఎక్కువ చక్కెర, ఎక్కువ కెఫీన్ సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి ఉదయం లేవగానే ముందుగా నీరు తాగి.. మీ శరీరానికి సరిపోయే ఆరోగ్యకరమైన పానీయం, పోషకాలతో కూడిన అల్పాహారంతో రోజును ప్రారంభించండి.ఎందుకంటే నిజమైన ఉత్సాహం.. ఒక కప్పు టీ నుంచి మాత్రమే కాదు.. మంచి నిద్ర, సరైన నీరు, సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన జీవనశైలి నుంచి వస్తుందని తెలుసుకోండి..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..












