Instagram: ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్ స్టాగ్రామ్ గురించి ఓ ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. భారత్ లో ఇన్ స్టాగ్రామ్ ను ఆగస్ట్ 25వ తేదీ అర్థరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ప్రచారం అవుతోంది. దీంతో ఇన్ స్టా యూజర్లు ఆందోళన చెందుతున్నారు. నిషేధం నిజమే అనుకుని బెంగ పెట్టేసుకున్నారు. అయితే, ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ (నిజ నిర్ధారణ) విభాగం.. PIB (ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.
పీఐబీ ఈ ప్రచారాన్ని ఖండించింది. అందులో నిజం లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఎక్స్ వేదికగా సూచన చేసింది. కేంద్రానికి సంబంధించి అనుమానిత ఫోటో కానీ వీడియో కానీ మేసేజ్ కానీ కనిపిస్తే తమకు పంపాలని పీఐబీ కోరింది. దానిపై దర్యాఫ్తు చేసి సరైన సమాచారం తెలియజేస్తామంది. ఎలాంటి ధృవీకరణ చేసుకోకుండా ఓ నిర్ణయానికి వచ్చేయడం కరెక్ట్ కాదంది.
''భారతదేశంలో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం విధిస్తారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. 2026 ఆగస్టు 25 రాత్రి నుండి భారత ప్రభుత్వం దీనిపై నిషేధం విధిస్తుందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఈ ప్రచారం అవాస్తవం. అందులో నిజం లేదు. కేంద్రం అలాంటి ప్రకటన ఏదీ చేయలేదు" అని ప్రభుత్వానికి చెందిన ఫ్యాక్ట్-చెక్ విభాగం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
''భారత ప్రభుత్వం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. అటువంటి తప్పుదోవ పట్టించే వాదనలను నమ్మకండి" అని ఆ పోస్ట్‌లో పేర్కొంది PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారంపై ధృవీకరణ కోసం తమకు నివేదించాలని కూడా పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రజలను కోరింది.












