తమిళనాడు ముఖ్యమంత్రికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు సోమవారం రద్దు చేసింది. ఇక తమిళనాడులోని కరూర్‌లో 2025 సెప్టెంబర్ 27న కరూర్ తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది.
టీవీకే (TVK) అధినేత విజయ్ నిర్వహించిన ఈ భారీ ర్యాలీలో సుమారు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై దర్యాప్తు తీరుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 2025 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నుంచి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి బదిలీ చేసింది.
నిష్పాక్షికంగా, స్వతంత్రంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రస్తుతం సీబీఐ ఈ ఘటనకు సంబంధించిన పలు కీలక అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇక ఇటీవల కరూర్ పర్యటనకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 32 మంది కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక ఉత్తర్వులను అందజేశారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బాధిత కుటుంబాల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో విజయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ఊహించని షాక్ తగిలింది.












