తెలంగాణ

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు..? కోర్టు కేసులే అడ్డంకి!

రచన: Kashi7 నిమిషాల పఠనం

ఎన్నికలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కొత్త "క్యూర్" చట్టాన్ని చెబుతున్నారు. దాదాపు 70 ఏళ్లుగా అమల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టానికి బదులుగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ముసాయిదా బిల్లును విడుదల చేసి ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఆ ప్రక్రియ పూర్తయి బిల్లు అసెంబ్లీ ఆమోదం పొంది చట్టంగా మారడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల‌పై నో క్లారిటీ

ట్రిపుల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఇంకెప్పుడు..?

కొత్త చట్టం, కోర్టు కేసులతో మరింత జాప్యమా?

ఆశావ‌హుల్లో త‌ప్ప‌ని ఎదురుచూపులు

హైదరాబాద్ నగర పాలనలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం.. జీహెచ్‌ఎంసీ స్థానంలో మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. గతంలో 150 డివిజ‌న్లే ఉండగా.. ఇప్పుడు మూడు కార్పొరేషన్లలో కలిపి దాదాపు 300 డివిజ‌న్ల‌ను ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో అన్ని రాజకీయ పార్టీల్లో వందలాది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్నికలు మాత్రం ఎప్పుడు జరుగుతాయన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఆరు నెలల గడువు పూర్తవుతున్నా.. ఎన్నికల జాడ లేదు

పాత జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసిన తర్వాత మూడు కొత్త కార్పొరేషన్లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. చట్టం ప్రకారం రద్దయిన స్థానిక సంస్థలకు ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ గడువు కూడా వచ్చే నెల 10వ తేదీతో ముగియనుంది. అయినప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ప్రభుత్వం కానీ, ఎన్నికల సంఘం కానీ ఇప్పటివరకు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు.

కొత్త చట్టమే ప్రధాన కారణమా?

ఎన్నికలు ఆలస్యం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా కొత్త "క్యూర్" చట్టాన్ని చెబుతున్నారు. దాదాపు 70 ఏళ్లుగా అమల్లో ఉన్న జీహెచ్‌ఎంసీ చట్టానికి బదులుగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ముసాయిదా బిల్లును విడుదల చేసి ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలు స్వీకరిస్తోంది. ఆ ప్రక్రియ పూర్తయి బిల్లు అసెంబ్లీ ఆమోదం పొంది చట్టంగా మారడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

డీలిమిటేషన్ కేసులు కూడా అడ్డంకే

మరోవైపు వార్డుల డీలిమిటేషన్‌పై హైకోర్టులో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వార్డుల విభజనలో లోపాలున్నాయని పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండా ఎన్నికలు నిర్వహిస్తే.. భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే స‌మ‌యంలో మ‌రో కీలక అంశం కూడా చర్చకు వస్తోంది. ప్రస్తుతం సైబరాబాద్ కార్పొరేషన్‌లో 76 వార్డులు, మల్కాజిగిరి కార్పొరేషన్‌లో 74 వార్డులు ఉన్నాయి. అయితే ఒక్కో కార్పొరేషన్‌లో 100 వార్డులు ఉండేలా ప్రభుత్వం పరిశీలిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే వార్డుల సరిహద్దులు పూర్తిగా మారిపోతాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.

అభివృద్ధి పనులతో ఎన్నికల వ్యూహమా?

ఎన్నికలు వాయిదా పడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కొత్త కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోంది. వేల కోట్ల రూపాయలతో రోడ్లు, ఫ్లైఓవర్లు, మౌలిక వసతుల అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న రెండు భారీ ఫ్లైఓవర్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలైంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రజలకు కనిపించిన తర్వాత ఎన్నికలకు వెళితే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని అధికార పార్టీ భావిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఎమ్మెల్యేల నెట్‌వర్క్ లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో పార్టీ బలం పెంచుకోవడానికి కార్పొరేషన్ ఎన్నికలను కాంగ్రెస్ కీలక అవకాశంగా చూస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి.

ట్రిపుల్ కార్పొరేషన్ల ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే కావు. రాబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయాన్ని అంచనా వేసే సెమీఫైనల్‌గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే కొత్త చట్టం, డీలిమిటేషన్ కేసులు, ఓటరు జాబితా ప్రక్షాళన వంటి ప్రక్రియలు పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#GHMC Elections#Hyderabad Triple Corporations#Telangana Politics#GHMC Delimitation#Telangana Congress#BRS#BJP Telangana#CURE Act
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి