దేవుడిని భక్తులు కోరికలు కోరడం కామన్. అందుకోసం ముడుపులు కడుతుంటారు. మొక్కులు మొక్కుతారు. కోరికలు నెరవేరితే అది చేస్తాం ఇది చేస్తాం.. దీక్షలు ఉంటామని వేడుకుంటుంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా మొక్కులు తీర్చుతుంటారు. మరికొందరు హుండీలో డబ్బులు వేస్తామని అంటుంటారు.అయితే,కొందరు మనసులో కోరుకుంటే నెరవేరడం లేదని ఏకంగా లేఖలు రాయడం మొదలెట్టారు. ఇలాంటి ఘటనలో అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో వెలుగుచూసింది.

ఆలయ హుండీల్లో కానుకలు, మొక్కుబడి చీటీలు కనిపించడం సాధారణమే. కానీ, అలంపూర్ జోగులాంబ అమ్మవారి హుండీలో మాత్రం ఏకంగా ఒక 'బయోడేటా' కనిపించింది. లేఖలోని సారాంశం ఇలా ఉంది.. "అమ్మా జోగులాంబ.. పదో తరగతి నుంచి B.Ed వరకు ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నా. ఏళ్ల తరబడి ప్రిపేర్ అయినా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదు.ఈ సారి నువ్వే నాకు జాబ్ ఇప్పించాలి తల్లీ!" అని రాసి ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
సిబ్బంది ఆలయ హుండీ లెక్కింపు సమయంలో ఈ లెటర్ ప్రత్యక్షమవ్వగా.. అది కాస్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. పదో తరగతి నుండి B.Ed వరకు ప్రతి ఎగ్జామ్‌లో 80% పైగా మార్కులు సాధించినట్టు తన బయోడేటా ఫామ్‌ను లేఖకు జత చేశాడు సదరు భక్తుడు. కష్టపడి చదివినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని, ఇక నీవే నాకు దిక్కు అంటూ అమ్మవారిని వేడుకున్నాడు. అలాగే.. తన దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా చూడాలని, ప్రశాంతత ప్రసాదించాలని వేడుకున్నాడు. ఓ ఉద్యోగం రావాలని.. మరోవైపు జీవన చక్రం సాఫీగా సాగాలని ఆ భక్తుడు కోరికలు కోరడం, బయోడేటా ఫామ్ అటాచ్ చేయడం అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. లేఖ బయటకు లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












