ప్రముఖ కోలీవుడ్ నటుడు ఆర్య (జంషెడ్ సి)తో పాటు ఆయన నటిస్తున్న మలయాళ చిత్రం ‘అనంతన్ కాడు’ నిర్మాతలపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా షూటింగ్‌కు సంబంధించిన కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల అద్దె బకాయిలు రూ.1.80 కోట్లకు పైగా చెల్లించకుండా ఎగ్గొట్టారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఈ వ్యవహారానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ‘తాహెర్ సినీ టెక్నిక్’ సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2025 ఫిబ్రవరిలో నటుడు ఆర్య, నిర్మాత వినోద్ తమ సంస్థను సంప్రదించి, సినిమా చిత్రీకరణ కోసం ఖరీదైన కెమెరాలు, లైటింగ్ యూనిట్లను హైదరాబాద్ నుంచి కేరళకు తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు.
అయితే, షూటింగ్ పూర్తయిన తర్వాత ఇవ్వాల్సిన మొత్తం అద్దె రూ.2.12 కోట్లలో మెజారిటీ వాటాను చెల్లించకుండా వారు మోసం చేశారని వివరించారు. బాకీ ఉన్న డబ్బులు ఇస్తామని పలుమార్లు నమ్మించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినప్పటికీ, ఇప్పటివరకు రూపాయి కూడా చెల్లించలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
బకాయిల విషయమై ఫోన్, వాట్సాప్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించినా వారు స్పందించలేదని, పైగా డబ్బుల గురించి అడిగిన తమ సంస్థ మేనేజర్‌ను నటుడు ఆర్య, నిర్మాతతో పాటు ఆర్య పీఏ కిషోర్ బెదిరించారని ఆరోపించారు. అంతేకాకుండా, అసలు విషయాలను దాచిపెట్టి కేరళ కోర్టు నుంచి వారు మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.












