క్రైమ్

TG: షాబాద్ ఆరు హత్యల కేసు.. రాజ్ కుమార్ ఆచూకీ తెలిపితే రూ.2లక్షల రివార్డ్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

 రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడు రాజ్‌కుమార్ కోసం పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో ఒక కీలక అడుగు పడింది. కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు రాజ్‌కుమార్‌కు సంబంధించిన కారును పోలీసులు శనివారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

 కారు లభించడంతో నిందితుడు రైలు మార్గం ద్వారా ఎక్కడికైనా పారిపోయాడా లేదా సమీప ప్రాంతాల్లోనే నక్కి ఉన్నాడా అనే కోణంలో పోలీసులు పక్కా ఆధారాల కోసం ఆరా తీస్తున్నారు.  ఈ మేరకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అతడు ఇప్పటి వరకు అయితే ఆత్మహత్య చేసుకోలేదని, పారిపోవడానికే రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకునేందుకు పోలీసులు భారీ నగదు బహుమతిని ప్రకటించారు.

 రాజ్‌కుమార్ ఆచూకీ కనిపెట్టి సమాచారం అందించిన వారికి రూ.2లక్షల రివార్డు ఇస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని, ప్రజలు ఎవరైనా నిందితుడిని గుర్తిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. పోక్సో కేసులో నిందితుడైన రాజ్‌కుమార్ గురువారం అర్ధరాత్రి ఈ నరమేధానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. రాజ్‌కుమార్‌ హత్యలు చేయడానికి ముందు బర్డ్వైజర్ బీరు తాగి బాలిక ఇంటికి వెళ్లినట్లు అక్కడ లభించిన టిన్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

 అదేవిధంగా బాలికపై కన్నేసిన రాజ్ కుమార్ తన ఇంటి వద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేసి బాలిక ఇంటి గేటు వైపుగా అమర్చినట్లు గుర్తించారు. దీని ద్వారా ఎప్పటికప్పుడు బాలిక కదలికలను రాజ్ కుమార్ ఫోన్ లో చూసుకునేవాడని అనుమానిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఇదే సీసీ కెమెరా కీలకంగా మారింది. బాలికను లాక్కెళ్తున్న దృశ్యాలు ఇందులో రికార్డు కావడంతో ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న కీలక ఆధారంగా మారింది. కేసు విషయంలో కక్ష పూరిత హత్యల అనంతరం నిందితుడు తన కన్న బిడ్డలతో పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న సరితను కూడా హత్య చేయడం అంతు చిక్కని విషయం. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.

#ShabadMurders#Rajkumar#PoliceChase#RewardAnnounced#CrimeNews#Telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి