షాబాద్ వరుస హత్యల కేసులో ప్రజల ఆగ్రహావేశాలు మరోసారి పెల్లుబికాయి. నిందితుడు రాజ్ కుమార్‌ను పోలీసులు ఇంతవరకు పట్టుకోలేదు. అసలు ఎక్కడ ఉన్నాడు రాష్ట్రంలోనే ఉన్నాడా? స్టేట్ దాటాడా? అనే దానికి కూడా వారిదగ్గర సమాధానం కరువైంది. దీనికి తోడు ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు ఇంతవరకు ఎటువంటి భరోసా అందలేదు. నష్టనివారణ చర్యల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్, నిందితుడికి సహకరించాడనే నేపథ్యంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు సీపీ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలాఉండగా, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ మీద బలమైన సెక్షన్స్ పెట్టుకుండా పోలీసులకు లంచం ఇచ్చాడని కూడా ఆరోపణలు వినిపించాయి. తన మీద కేసు పెట్టిన బాధిత మైనర్, ఆమె కుటుంబాన్ని చంపేస్తానని నిందితుడు ముందే హెచ్చరించినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, నిందితుడికే మద్దతుగా నిలిచారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
షాబాద్ ఘటనలో పోస్టుమార్టం అనంతరం బాలిక, కుటుంబ సభ్యుల మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. అయితే, మృతదేహాలను గ్రామ సర్పంచ్ మున్సిపాలిటీ ట్రాక్టర్లో తరలించాడని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఫిర్యాదు చేస్తే సర్పంచ్‌పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. సర్పంచ్ రావాల్సిందేనని గ్రామస్తులు పట్టుబడుతున్నారు. ఇదిలాఉండగా, షాబాద్ ఘటనలో నిందితుడు రాజ్‌కుమార్‌పై రూ.2 పోలీసులు లక్షల రివార్డ్ ప్రకటించారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రివార్డు అందజేస్తామన్నారు.
ప్రస్తుతం ఈ హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేసినా ప్రభుత్వంలోని పెద్దలు ఈ ఘటనపై పెద్దగా స్పందించకపోవడం గమనార్హం.కాగా, కన్నకొడుకులను చంపడానికి ఎలా మనసు వచ్చిందంటూ నిందితుడు రాజ్ కుమార్ ను సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.












