Elnino: ఎల్ నినోపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. సీఎం రేవంత్, మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులకు 23 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ సంధించారు. సంక్షోభం వచ్చి ఆరు నెలలయ్యాక ‘ఉపసంఘం’ డ్రామానా? అని లేఖలో మండిపడ్డారు. ఎల్ నినో విపత్తు ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే అని ధ్వజమెత్తారు. పంటలు ఎండిపోయాక, వర్షాకాలం ముగిశాక కమిటీ వేయడం ప్రజా వంచన కాదా? అని నిలదీశారు.
రూ.20వేల కోట్ల అత్యవసర అనుబంధ బడ్జెట్ ప్రవేశపెట్టాలి
కేసీఆర్‌పై రాజకీయ కక్షతో 1,000 టీఎంసీల ప్రాణహిత జలాలను వృథాగా వదిలేసి రైతుల నోట్లో మన్నుకొట్టారు అని వాపోయారు. బడ్జెట్ లేదు.. గడువు లేదు.. జీవో 1523 కేవలం ప్రజల దృష్టి మళ్లించే కాగితాల కసరత్తు అంటూ విమర్శించారు. వెంటనే శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి రూ. 20,000 కోట్ల అత్యవసర అనుబంధ బడ్జెట్ ప్రవేశపెట్టాలని రేవంత్ సర్కార్ డిమాండ్ చేశారు.
కాలయాపన ఎత్తుగడ
తెలంగాణను తీవ్రంగా కుదిపేస్తున్న కరువు, ఎల్ నినో సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇది ప్రకృతి సృష్టించిన విపత్తు కాదని, ముమ్మాటికీ పాలకుల చేతగానితనం నేరపూరిత పరిపాలనా నిర్లక్ష్యమేనని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అక్టోబర్ 19న విడుదల చేసిన జీవో నెంబర్ 1523 ద్వారా ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం కేవలం బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి వేసిన ఒక కాలయాపన ఎత్తుగడ మాత్రమేనని ధ్వజమెత్తారు.
1. హెచ్చరిక ఏప్రిల్‌లో.. మేల్కొలుపు అక్టోబర్లా? ఇదేనా సంక్షోభ నిర్వహణ?
భారత వాతావరణ శాఖ (IMD) ఏప్రిల్ రెండో వారంలోనే ఎల్ నినో ముప్పు పొంచి ఉందని, వర్షపాతం లోటు ఉంటుందని దేశవ్యాప్తంగా హెచ్చరించింది. మార్చి బడ్జెట్ సమావేశాల నుంచే నిపుణులు నెత్తీనోరూ బాదుకున్నారు. కానీ ప్రభుత్వం ఆరు నెలల పాటు కుంభకర్ణ నిద్ర పోయింది. వర్షాకాలం ముగిసి 19 రోజులు గడిచాక, 18 జిల్లాల్లో తీవ్ర వర్షపాత లోటు నమోదై, రిజర్వాయర్లు అడుగంటి, రైతులు పెట్టిన ఖరీఫ్ పంటలు చేతికి రాక ఎండిపోతుంటే ఇప్పుడు తీరిగ్గా మంత్రివర్గ ఉపసంఘం వేయడం ప్రభుత్వ పాలకుల దివాళాకోరుతనానికి నిదర్శనం. ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ కాదు, క్రైసిస్ ముగిశాక చేస్తున్న "కాగితాల మేనేజ్మెంట్".
2. గడువు లేదు.. నయాపైసా నిధి లేదు: జీవో 1523 ఒక కంటితుడుపు చర్య
ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1523ని పరిశీలిస్తే ఈ కమిటీ ఎంతటి డొల్లతనంతో కూడుకున్నదో అర్థమవుతోందన్నారు.
* ఉపసంఘం తన నివేదికను ఎప్పటిలోగా సమర్పించాలో నిర్దిష్ట గడువు లేదు.
* క్షేత్రస్థాయిలో కరువు నివారణకు ఖర్చు చేయడానికి కమిటీకి ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించలేదు. నిధులు లేని కమిటీ ఇచ్చే ఆదేశాలకు విలువ ఎక్కడుంటుంది?
* గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 3 లక్షల నల్లా కనెక్షన్లకు డిసెంబర్ నాటికి తీవ్ర తాగునీటి ముప్పు పొంచి ఉందని తెలిసినా, ఈ కమిటీలో మున్సిపల్ పరిపాలనా శాఖకు, జలమండలికి కనీస ప్రాతినిధ్యం కల్పించకపోవడం దారుణం.
* జూలైలోనే నిపుణుల కమిటీ ఇచ్చిన రూ. 817 కోట్ల అత్యవసర సిఫార్సులను (విత్తన రాయితీ, సూక్ష్మ సేద్యం, పశుగ్రాసం) బుట్టదాఖలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్త కమిటీతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోంది.
3. రాజకీయ కక్షతో 1,000 టీఎంసీల ప్రాణహిత జలాలు వృథా: రైతుల నోట్లో మన్నుకొట్టారు!
కేసీఆర్ పై ఉన్న రాజకీయ ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయడానికి ప్రభుత్వం వేల కోట్ల విలువైన గోదావరి నీళ్లను సముద్రం పాలు చేసిందని శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
* కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా రోజుకు 2 నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ, గేట్లు తెరిచిన స్థితిలోనే నీటిని ఎల్లంపల్లికి తరలించవచ్చని రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఉచితంగా సేవలందిస్తామని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
* కేవలం రూ.10 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. ఫలితంగా ఈ సీజన్లో 1,000 టీఎంసీలకు పైగా ప్రాణహిత జలాలు దిగువకు వెళ్లిపోతుంటే చూస్తూ కూర్చున్నారు. ఉత్తర తెలంగాణ రైతుల పొలాలను ఎండబెట్టి వారి నోట్లో మన్నుకొట్టిన ఈ పాపం ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని విరుచుకుపడ్డారు.
4. అంచనాల వైఫల్యం.. చీకట్లో విద్యుత్ రంగం!
విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేయడంలో ప్రభుత్వం ఘోరంగా బోల్తా పడింది. అక్టోబర్‌లో 15,000 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తే, అది రికార్డు స్థాయిలో 20,003 మెగావాట్లకు చేరింది.
* ముందుచూపుతో ముందస్తు విద్యుత్ ఒప్పందాలు చేసుకోకుండా, రియల్ టైమ్ మార్కెట్లో యూనిట్‌కు ఏకంగా రూ. 9.41 వెచ్చించి, ఒక్క రోజులోనే రూ. 42.92 కోట్ల ప్రజాధనాన్ని తగలేశారు. ఈ భారాన్ని రేపు విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై మోపుతారా అని ప్రశ్నించారు.
* 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు నడవక రైతులు రోడ్లపైకి వచ్చి సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు.
* ప్రతిష్టాత్మక యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో కనీసం 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు కూడా లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్ట.
5. తాగునీటికి జిల్లాకు కోటి రూపాయలా? హాస్యాస్పదం కాదా?
రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల్లో కృష్ణా బేసిన్లో 71 శాతం, గోదావరిలో 34 శాతం లోటు నెలకొంది. 40 శాతం చెరువుల్లో నీళ్లు లేవు. ఈ సీజన్‌కు 460 టీఎంసీలు అవసరం కాగా కేవలం 209 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సంగారెడ్డిలో ఇప్పటికే రోజు విడిచి రోజు నీళ్లు ఇస్తున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో అత్యవసర తాగునీటి కోసం జిల్లా కలెక్టర్లకు కేవలం కోటి రూపాయల చొప్పున విదిలించడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని శ్రవణ్ మండిపడ్డారు. 2027 అక్టోబర్ వరకు ఈ అరకొర నిధులతో ప్రజల దాహం ఎలా తీరుస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
6. ఎల్ నినో 'కోవిడ్ లాంటి విపత్తు' అయితే ప్రత్యేక బడ్జెట్ ఏదీ?
ముఖ్యమంత్రి స్వయంగా ఎల్ నినోను ‘కోవిడ్ లాంటి విపత్తు’ అని ప్రకటించినప్పుడు, రాష్ట్ర ఖజానా నుండి అత్యవసర నిధులు ఎందుకు కేటాయించలేదు?
* కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 20,000 కోట్ల ప్యాకేజీ అడగడం సమర్థనీయమే అయినా, అసలు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (SDRF) నుండి ఇప్పటివరకు విడుదల చేసిన నిధులెన్ని?
* 10 లక్షల ఎకరాల పంటలు దెబ్బతినే ప్రమాదంలో పడ్డాయి. రబీలో వరి వేయవద్దని రైతులకు ఉచిత సలహాలు ఇస్తున్న ప్రభుత్వం, ప్రత్యామ్నాయ పంటలకు ఉచిత విత్తనాలు, గిట్టుబాటు ధర హామీ ఎందుకు ఇవ్వడం లేదు?
* ఇప్పటివరకు అధికారికంగా కరువు మండలాల సంఖ్యను ప్రకటించకుండా అయోమయం ఎందుకు సృష్టిస్తున్నారు?
ప్రభుత్వానికి బీఆర్ఎస్ తక్షణ డిమాండ్లు:
1. జీవో సవరణ & 15 రోజుల గడువు: జీవో నెం. 1523ను తక్షణమే సవరించి, కేబినెట్ సబ్ కమిటీకి 15 రోజుల నిర్దిష్ట గడువు విధించాలి. కమిటీకి స్వతంత్ర అత్యవసర బడ్జెట్ కేటాయించి, మున్సిపల్ శాఖకు చోటు కల్పించాలి.
2. శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు: ఎల్ నినో కరువు పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు తక్షణమే అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలి.
3. రూ. 20,000 కోట్ల అనుబంధ బడ్జెట్: కేంద్ర సాయం వచ్చే వరకు ఎదురుచూడకుండా, రాష్ట్ర ఖజానా ద్వారా అత్యవసర అనుబంధ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాలి.
4. శ్వేతపత్రం విడుదల: ఏప్రిల్ నుండి ఇప్పటివరకు కరువు నివారణకు ఖర్చు చేసిన ప్రతి రూపాయిపై, గోదావరి నుండి దిగువకు వెళ్లిన నీటి లెక్కలపై, అధిక ధరలకు కొనుగోలు చేసిన కరెంట్ వివరాలపై పూర్తి స్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలి.
5. రైతాంగానికి పరిహారం: పంట నష్టపోయిన ప్రతి రైతుకు, కౌలు రైతులకు ఎకరాకు నిర్దిష్ట ఇన్పుట్ సబ్సిడీని తక్షణమే ప్రకటించి పంపిణీ చేయాలి.
"వర్షం ప్రకృతి చేతిలో ఉండవచ్చు.. కానీ పంపులు నడపడం, విద్యుత్ సమకూర్చడం, జలాశయాలను కాపాడటం, అన్నదాతకు భరోసా ఇవ్వడం ముమ్మాటికీ పాలకుల చేతుల్లోనే ఉంటుంది. ఆరు నెలల పాటు చేతులు ముడుచుకుని కూర్చుని రాష్ట్రాన్ని కరువు కోరల్లోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి" అని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. బహిరంగ లేఖలో తాను లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం నాటికి ప్రభుత్వం రాతపూర్వక అంకెలతో కూడిన సమాధానాలు ఇవ్వాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.


