Bhu Bharati: దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ వ్యవస్థ పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సోమవారం అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్ష నిర్వహించారు.
మరింత పారదర్శకంగా, వేగంగా రెవెన్యూ సేవలు
భూభారతి చట్టం అమలు, రైతులకు పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారం, ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా పనిచేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
గత ప్రభుత్వం నిర్లక్ష్యం, స్వార్ధపూరిత నిర్ణయాల వల్ల పదేళ్లలో రెవెన్యూ వ్యవస్ధ పూర్తిగా అస్థవ్యస్తమైందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూవివాదాలు లేని తెలంగాణ ఉండాలన్న సంకల్పంతో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేస్తూ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలకు భూభారతి చట్టంలో పేర్కొన్న విధంగా రీ-సర్వే ద్వారా పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు. సాగుదారులను గుర్తించి చట్టబద్ధమైన భూ హక్కులు కల్పిస్తామన్నారు.
పాస్ పుస్తకాలతో రుణాలు, రైతు భరోసా
భూ భారతి చట్టం అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 14, 2025 నుంచి ఇప్పటి వరకు 5,68,858 పాస్ బుక్కులు జారీ చేశామని తెలిపారు. అదేవిధంగా గడిచిన 34 నెలల్లో 12,40,366 పాస్ బుక్ లను రైతులకు అందజేశామన్నారు. పాస్ పుస్తకాలతో రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం లభించిందని తెలిపారు. ఇదే పద్దతిలో అన్ని ప్రాంతాల్లో కూడా రీ-సర్వే నిర్వహించి హక్కుదారులకు పాస్ పుస్తకాలు అందిస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.


