Old City Fire: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్ పరిధి మదీనా క్రాస్ రోడ్డులోని బాంబే హోసరీ వస్త్ర దుకాణం, గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం వస్త్ర దుకాణంలో మంటలు అంటుకున్నాయి. మంటలు చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. వస్త్ర దుకాణం ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం వెనుకే గోదాం ఉంటుంది. పండుగ సీజన్ కావడంతో గోదాములో పెద్ద ఎత్తున వస్త్రాలు నిల్వ ఉంచారు. అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. గోదాములో పెద్ద ఎత్తున వస్త్రాలు ఉండటంతో మంటలు భవనం మొత్తం వేగంగా వ్యాపించాయి. అక్కడ దట్టమైన పొగతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.


