తెలంగాణ

Telangana Politics: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. రాష్ట్రంలో ఢిల్లీ దళాల మోహరింపు..!

రచన: Mahesh••6 నిమిషాల పఠనం

Telangana Politics: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు తెలంగాణే సరైన వేదిక అని బీజేపీ అధిష్ఠానం గట్టిగా నిర్ణయించుకుంది. ఇన్నాళ్లూ కేవలం రాష్ట్ర స్థాయి నేతల ప్రకటనలు, నిరసనలతో సరిపెట్టిన బీజేపీ హైకమాండ్.. ఇప్పుడు గేరు మార్చి నేరుగా ఢిల్లీ సైన్యాన్ని తెలంగాణ గడ్డపై మోహరిస్తోంది.

Telangana Politics: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు తెలంగాణే సరైన వేదిక అని బీజేపీ అధిష్ఠానం గట్టిగా నిర్ణయించుకుంది. ఇన్నాళ్లూ కేవలం రాష్ట్ర స్థాయి నేతల ప్రకటనలు, నిరసనలతో సరిపెట్టిన బీజేపీ హైకమాండ్.. ఇప్పుడు గేరు మార్చి నేరుగా ఢిల్లీ సైన్యాన్ని తెలంగాణ గడ్డపై మోహరిస్తోంది. జాతీయ ఎన్నికల వ్యూహకర్తలు, సంఘటనా నిపుణులు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంలోనే తిష్టవేసేలా పక్కా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన "ఇంకా మా ఆట మొదలే కాలేదు" అన్న మాటల వెనుక ఉన్న అసలు ఆయుధం.. ఢిల్లీ పెద్దలు పంపబోతున్న ఈ ప్రత్యేక దళాలేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

హైదరాబాద్ కాదు.. వరంగల్ కేంద్రంగా మాస్టర్ ప్లాన్

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నే ప్రధాన కార్యాలయంగా చేసుకుని వ్యూహాలు రచిస్తుంది. కానీ, బీజేపీ ఈసారి రూటు మార్చింది. తెలంగాణ రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉత్తర తెలంగాణ నడిబొడ్డు ‘వరంగల్’ను తన ప్రధాన కార్యస్థానంగా ఎంపిక చేసుకుంది. బీజేపీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి దశరథ్ పండుగ ముగియగానే నేరుగా వరంగల్‌లోనే మకాం వేయనున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని బూత్ స్థాయి క్యాడర్‌ను పూర్తిస్థాయి ఎన్నికల యంత్రంగా మలచడమే ఆయన ప్రధాన బాధ్యతగా కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు కీలక రాష్ట్రాల్లో బీజేపీని విజయతీరాలకు చేర్చిన చాణక్యుడు సునీల్ బన్సల్, సీనియర్ వ్యూహకర్త అభయ్ పాటిల్ ఇకపై తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ప్రక్రియ పూర్తి కాగానే సమన్వయకర్త మధుకర్ కూడా తన పూర్తి సమయాన్ని తెలంగాణకే కేటాయించనున్నారని సమాచారం.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

ఈ ఢిల్లీ దళాల మోహరింపు వెనుక కేవలం సంస్థాగత నిర్మాణం మాత్రమే కాదని, ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసే దూకుడు వ్యూహంలో భాగం అని చెబుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో లోపాలు, ప్రజా అసంతృప్తిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు స్పేస్ లేకుండా చేసి, కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే అనే భావనను ప్రజల్లో బలంగా నాటడం ఈ టీం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వయంగా వచ్చి తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని చేసిన ప్రకటన, ఆ వెంటనే కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకం.. అంతా ఒక పకడ్బందీ టైమ్‌లైన్ ప్రకారం సాగుతున్నట్లు స్పష్టమవుతోంది.

ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలే సెమీఫైనల్స్

సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ, ఈలోగా వచ్చే శాసనమండలి ఎన్నికలు, ఆ తర్వాత రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలనే బీజేపీ తమ ఆపరేషన్‌కు టెస్టింగ్ గ్రౌండ్‌గా మార్చుకోబోతోంది. క్షేత్రస్థాయి నుంచి అసంతృప్త నేతలను చేర్చుకోవడం, బలమైన నాయకత్వాన్ని సిద్ధం చేయడం ద్వారా ప్రత్యర్థులకు ఊపిరి సలపనివ్వకుండా చేయాలన్నదే ఢిల్లీ బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తుంది. రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ అగ్రశ్రేణి మేధోశక్తి, సంస్థాగత బలం తోడైతే తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయోనని ప్రధాన పార్టీలు సైతం తీవ్ర ఉత్కంఠతో గమనిస్తున్నాయి. కిషన్ రెడ్డి చెప్పిన "ముందుంది ముసళ్ల పండుగ" అన్న వార్నింగ్ వెనుక ఉన్న అసలు ఆపరేషన్ ఇదేనని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

#Telangana Politics#Telangana BJP#BJP Telangana#Bharatiya Janata Party#BJP High Command#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి