రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భారీగా అవినీతికి పాల్పడుతోందని, రూ.వేల కోట్ల ఆస్తులు అక్రమంగా కాజేసి వారి, వారి బినామీల పేర్ల మీద పొగేశారని బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ కుటుంబం, అతని సోదరులు పాల్పడిన అవినీతికి సంబంధించిన లెక్కలు తన వద్ద ఉన్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందాను పూర్తి ఆధారాలతో మన్నె క్రిశాంక్ బయటపెట్టారు.
తెలంగాణ భవన్లో సోమవారం మన్నెక్రిశాంక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు ఫండ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని అనుముల కృష్ణారెడ్డి బెదిరించినట్టు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చందన్వల్లి గ్రామంలోని 363 సర్వే నంబర్లో ఉన్న నిషేధిత భూమిలో 363/3 భూమిని ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు.
అసైన్డ్ భూమి నుంచి ఆ భూమిని అగ్రికల్చర్ భూమిగా మార్చారన్నారు.‘363 సర్వే నంబర్లో అన్ని భూములు అసైన్డ్ భూములుగానే ఉన్నాయి. కానీ ఈ ఒక్క భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది.ఈ భూమి కోట శ్రీకాంత్ రెడ్డి అనే R9 కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి పేరిట, చేవెళ్ల నవనీత ద్వారా రిజిస్ట్రేషన్ అయింది. ఈ R9 కన్స్ట్రక్షన్స్ మొదటి పార్టనర్, యజమాని రేవంత్ రెడ్డి తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి అని క్రిశాంక్ ఆరోపించారు. ఈ కంపెనీ మంచిరేవులలో రూ.75 కోట్ల విల్లాలో ఉందన్నారు.
భూములు కొల్లగొట్టడానికే 22ఏ
22 ఏను తీసుకొచ్చింది పేదల భూములను కొల్లగొట్టడానికేనా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కుంభకోణాలు చేయడం వల్లే రేవంత్ ఫ్యామిలీ రూ.50 వేల కోట్లు దోచుకున్నదని ఆరోపణలు చేశారు. RR ట్యాక్స్ అని చెప్పే బీజేపీ, ఇన్ని స్కాంలు బయటపడుతున్నా ఎందుకు మౌనంగా ఉంటుంది? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి.. తన సోదరుడు కొండల్ రెడ్డి ‘టెస్సరాక్ట్’ కంపెనీ కోసం రూ.200 కోట్ల విలువైన భూమిని అప్పనంగా కట్టబట్టారన్నారు. స్వచ్ఛ బయో కంపెనీతో అమెరికాలో వెయ్యి కోట్ల ఒప్పందం చేసుకుందని, 5 హ్యుండాయ్ షోరూమ్స్ కోసం రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేటాయించారని బీఆర్ఎస్ నేత ఆరోపించారు.వీటిపై బీఆర్ఎస్ ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి నుంచి సమాధానం లేదని ఎద్దేవా చేశారు.
సీబీఐ విచారణకు సిద్ధమా?
మెడికవర్ ఆసుపత్రి, నైమిషా రెడ్డి నిర్మిస్తున్న ప్రైవేట్ స్కూల్స్, కొండల్ రెడ్డి ‘టెస్సరాక్ట్’, స్వచ్ఛ్ బయో, మ్యాక్స్ బీన్ ఫార్మా, గీతా హ్యుండాయ్ కంపెనీలతో సీఎం రేవంత్ ఫ్యామిలీకి సంబంధం లేదంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని మన్నె క్రిశాంక్ సవాల్ విసిరారు.
మెడికవర్ ఆసుపత్రితో నీకు సంబంధం లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. ఒక ఆధారమైనా చూపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరితే తాము మూడు ఆధారాలు చూపించామని, ఇంతవరకు సమాధానం లేదన్నారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు సమర్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ప్రకటించారు.


