పేదలను విస్మరిస్తూ ధనికుల వైపు ప్రభుత్వ మొగ్గు
విచ్చలవిడిగా పెరుగుతున్న ఏసీ బోగీలు
ప్రైవేట్ దోపిడీకి బలవుతున్న సామాన్యులు
జనరల్ బోగీలు పెంచాలని ప్రజా సంఘాల డిమాండ్
పండుగ పూట స్వగ్రామాలకు వెళ్లే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు రైల్వే శాఖ నుంచి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం ధనికులకే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన రైలు ప్రయాణాన్ని సంపన్నులకే పరిమితం చేసేలా ప్రభుత్వ విధానాలు మారుతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను విపరీతంగా పెంచేస్తున్నారు.
ఆదాయమే ధ్యేయంగా సాగుతున్న ఈ తీరు వల్ల సాధారణ ప్రయాణికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. సంపన్నులకు పెద్దపీట వేస్తూ ఏసీ కోచ్‌లను విస్తరిస్తుండటంతో, సామాన్యుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా మారుతోంది. జనరల్, స్లీపర్ కోచ్‌లను భారీగా తగ్గించివేయడంతో సాధారణ ప్రయాణికుల సీట్లకు గండిపడుతోంది. కాచిగూడ-విశాఖపట్నం, ఫలక్‌నుమా, గోదావరి, నర్సాపూర్, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి ప్రధాన రైళ్లలో ఏసీ కోచ్‌లు భారీగా ఉంటే, జనరల్ బోగీలు నామమాత్రంగా మిగిలాయి.
జనరల్ కోచ్‌లకు బదులుగా ఏసీ కోచ్‌లను పెంచడం ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికేని ప్రయాణికులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు రవాణా వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో చార్జీల మోత మోగుతున్న తరుణంలో తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని భావించిన పేదలకు రైళ్లలో కనీసం నిలబడేందుకు కూడా చోటు దక్కడం లేదు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, చర్లపల్లి స్టేషన్లలో సామాన్యుల పరిస్థితి నరకప్రాయంగా మారుతోంది. ప్రైవేట్ దోపిడీని తట్టుకోలేక రైల్వేను ఆశ్రయిస్తే ఇక్కడ కూడా నిరాశే మిగులుతోంది.
ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలులో కనీసం నాలుగు సాధారణ బోగీలు ఉండాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, పండుగ రద్దీకి ఆ పరిమిత సంఖ్య ఏమాత్రం సరిపోవడం లేదు. బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం ఉన్నా, అసలు కోచ్‌లోకి అడుగుపెట్టలేని దయనీయ పరిస్థితి నెలకొంది. సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణమే సాధారణ బోగీల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేవలం ధనికులకే సౌకర్యాలు కల్పిస్తూ పేదల హక్కులను కాలరాసే చర్యలను మానుకోవాలని హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా రైల్వే శాఖ స్పందించి సామాన్యులకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచాలని కోరుతున్నారు.


