తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగెటివ్ ట్రోలింగ్‌పై భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) తీవ్రంగా స్పందించారు. వేడుకల్లో భాగంగా వెండి బతుకమ్మను ప్రదర్శించడంపై కొందరు నెటిజన్లు అనవసర విమర్శలు గుప్పించగా, వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సంప్రదాయం వెనుక ఉన్న అసలైన అర్థాన్ని, భావోద్వేగాలను తెలుసుకోకుండా నిందించడం సరికాదని హితవు పలికింది.
వివరాల్లోకి వెళితే.. పీవీ సింధు తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత జరుపుకున్న మొదటి బతుకమ్మ పండుగ ఇది. ‘మా పుట్టింట్లో బతుకమ్మ ఆచారం లేదు.. అందుకే ఈ పండుగ వేడుకల్లో పాల్గొనడం నాకు ఇదే మొదటిసారి’ అని సింధు తెలిపారు. పండుగ రోజున పూల బతుకమ్మను రోజంతా ఎంతో శ్రమించి స్వయంగా తానే పేర్చానని, కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా వేడుకలను ఆస్వాదించానని ఆమె వివరించారు.
ఇక వివాదానికి కారణమైన వెండి బతుకమ్మ గురించి మాట్లాడుతూ.. అది తన అత్తగారు చూపించిన స్వచ్ఛమైన ప్రేమకు సంకేతమని తెలిపారు. తమ సంప్రదాయంలోకి నూతన కోడలిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే అత్తగారు ఆ వెండి బతుకమ్మను తనకు బహుమతిగా ఇచ్చారని చెప్పారు. ‘మన పూజలు, సంప్రదాయాలతో పాటు తల్లి ప్రేమకు కూడా సమానమైన చోటు ఉంటుంది’ అంటూ సింధు క్లారిటీ ఇస్తూ ట్రోలర్ల నోళ్లు మూయించింది.
పీవీ సింధు ఇచ్చిన ఈ వివరణకు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఒక పండుగ వేడుకలో అత్తాకోడళ్ల అనుబంధాన్ని, ఆప్యాయతను అర్థం చేసుకోకుండా కేవలం విమర్శల కోసమే కామెంట్లు చేయడం సరికాదని పలువురు నెటిజన్లు సింధుకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు.


