తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఒక వ్యూహాత్మకమైన వ్యక్తిగా రాష్ట్ర యువత అభిమానించడం తెలిసిందే.. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూనే.. దొరల గడీల పాలనను బద్ధలు కొడుతానని బహిరంగంగా సవాలు చేయడం.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. ఇది ఆయనలో ఉన్న పట్టుదలకు నిదర్శనంగా నిలిచిందనే ప్రశంసలు అందుకుంది.
కానీ కొన్ని సందర్భాలలో ఆయన వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి-రేవంత్ రెడ్డి పట్ల వ్యవహరించిన తీరుపై ఆయన అభిమానులు హై ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు.. మల్లారెడ్డి పని అయిపోయిందని భావించారు. కానీ ఈ విషయంలో సీఎం చట్టాన్ని గౌరవిస్తూ తన పరిణితిని చాటుకున్నారు. వ్యక్తిగత వివాదాలకు పోకుండా రాజకీయాలపై దృష్టి సారించారు.
అయితే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఇందులో రేవంత్ దూకుడుగా వ్యవహరించడం వెనుక ఉన్న అంశాలు తెరమీదికి వచ్చాయి.. సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం మొదలైంది. ఒక ఈవెంట్ లో మాట్లాడిన అల్లు అర్జున్-రేవంత్ రెడ్డి పట్ల అమర్యాదగా ప్రవర్తించాడాని, అతను ఎవరో తెలియనట్టుగా వ్యవహరించాడని.. కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరో జీవితాంతం గుర్తుండిపోయేలా సీఎం, సంధ్య థియేటర్ ఘటనలో దూకుడుగా వ్యవహరించాడనే ప్రచారాలు పెద్ద ఎత్తున జరిగాయి..
ఇక పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ అబ్బాయి తీవ్రంగా గాయపడటం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో అనుమతులు లేకున్నా భారీ జనసమూహం మధ్యలోకి రావడానికి కారణమయ్యాడనే ఆరోపణలతో హీరో అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి వర్గం త్వరగా మర్చిపోయిందా అనే కొత్త చర్చలకు తెరలేచింది. అసెంబ్లీ సాక్షిగా, బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డిని అత్యంత హేయమైన పదజాలంతో ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేసిన మీమ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో కనిపించడం తెలిసిందే..
అంతటి తీవ్రమైన పదజాలంతో, వ్యక్తిగత దూషణలకు పాల్పడిన మల్లారెడ్డిపై కఠిన చర్యలు ఉండాలనే డిమాండ్లు వినిపించినా.. రేవంత్ సర్కార్ ఎందుకు పెదవి విప్పడం లేదనే ప్రశ్నలు తలెత్తాయి.. ఇందుకు కూడా కారణం లేకపోలేదు.. నిజానికి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన విద్యాసంస్థలు, యూనివర్సిటీలను మల్లారెడ్డి కేవలం సినిమా ఈవెంట్లకు, ప్రీ-రిలీజ్ వేడుకలకు అడ్డాగా మార్చేశారనే విమర్శలు జోరందుకున్నాయి.
అలా మల్లారెడ్డి కాలేజీ జరిగిన ఈవెంట్లలో తొక్కిసలాటలు జరిగి విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఉదంతాలున్నాయి. కొన్ని సందర్భాల్లో అపశృతులు చోటుచేసుకుని ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జరిగాయి.. మరోవైపు రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ పరిధిలోని నాదర్గుల్ ఎంవీఎస్ఆర్ (MVSR) ఇంజనీరింగ్ కాలేజీలో లైటింగ్ సిస్టమ్ ఒక్కసారిగా కూలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, పలువురు విద్యార్థులు గాయపడ్డారని వార్తలు వచ్చాయి..
మరి అల్లు అర్జున్ విషయంలో చూపిన దూకుడు, స్పందించిన వేగం.. మల్లారెడ్డి విద్యాసంస్థల పై ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ పై ఎందుకు చూపించలేక పోయారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మల్లారెడ్డి అంటే ప్రభుత్వానికి ఏమైనా భయమా? లేక రాజకీయ లెక్కలు అడ్డు వస్తున్నాయా? అనే కోణంలో సామాన్యులు నిలదీస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ అయినా.. మల్లారెడ్డి అయినా.. సామాన్యుడైనా.. చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని ప్రభుత్వం మరిచిందా? అని ప్రశ్నిస్తున్నారు..
ఒకరి విషయంలో కఠినంగా వ్యవహరించి, మరొకరి విషయంలో రాజకీయ సాన్నిహిత్యం కారణంగా మెతకగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు కూడా లేవనెత్తుతున్నారు. అదేవిధంగా విద్యాసంస్థల్లో భారీ ఈవెంట్ల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కూడా నెలకొంటుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. విద్యాసంస్థల్లో భారీ వినోద కార్యక్రమాలకు భద్రతా ప్రమాణాలు ఎంత కఠినంగా అమలవుతున్నాయనే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి, ఆయా కాలేజీలకు ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
మరోవైపు అసలు కాలేజీలను ఈవెంట్ స్టేజీలుగా ఎందుకు మార్చుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు ఉన్న పిల్లలు.. కాలేజీలో చేరి జీవితంలో ఇలా బ్రతకాలనే ఆశలను పెంచుకుంటారు. అలాగే తమ స్తోమతకు మించి మా బ్రతుకుల్లాగా పిల్లల బ్రతుకులు ఉండకూడదని తల్లిదండ్రులు అప్పులు చేసి తమ పిల్లలను కాలేజీల్లో చేర్పిస్తుంటారు. కానీ కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థి ప్రాణం కోల్పోతే.. వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి?.
చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పే ప్రభుత్వాలు.. తప్పు ఎక్కడ జరిగినా, తప్పు చేసిన వారు ఎంత పెద్ద వారైన పారదర్శకంగా వ్యవహరించాలి.. కానీ అల్లు అర్జున్ విషయంలో కఠినంగా వ్యవహరించి, మల్లారెడ్డి-MVSR కాలేజీ ఘటనలో మీనవేషాలు లెక్కిస్తు ఏదో చర్యలు తీసుకుంటున్నామన్నట్టు కాకుండా మరోసారి ఏ కాలేజీలు ఇలా ప్రవర్తించకుండా చేస్తే.. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి ఈ ఘటనల పై సీఎం రేవంత్ రెడ్డి తీరు ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా నిలుస్తుందని చర్చలు మొదలైనట్టు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ మీద కత్తి దూసిన రేవంత్ సర్కార్.. మల్లారెడ్డి-MVSR కాలేజీల విషయంలోనూ అదే నిబద్ధతను ప్రదర్శిస్తేనే పరిపాలనపై ప్రజలకు పూర్తి నమ్మకం కలుగుతుంది. లేదంటే, ఇది అల్లు అర్జున్ పై ద్వేషం.. మల్లారెడ్డిపై భయం అనే విమర్శలకు బలం చేకూరుస్తూందని జనం అనుకుంటున్నారు..


