దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో నిరసనలు చేపడుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో సరికొత్త గ్రూప్ రంగంలోకి దిగింది. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ (Lal Hit Janata Party) పేరుతో ఆవిర్భవించిన ఈ నూతన వేదిక.. దేశ రాజ్యాంగ సంస్థలకు మద్దతుగా నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది.
ఢిల్లీలోని మాలవియా స్మృతి భవన్‌లో ‘లాల్ హిట్ జనతా పార్టీ’ చీఫ్ అయాన్ భట్నాగర్ ఆధ్వర్యంలో తొలి సభ్యత్వ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయాన్ భట్నాగర్ మాట్లాడుతూ.. సీజేపీ నిర్వహిస్తున్న ఆందోళనల వల్ల దేశంలోని అత్యున్నత రాజ్యాంగబద్ధ సంస్థల గౌరవానికి భంగం కలుగుతోందని మండిపడ్డారు. పండుగల సీజన్‌లో కన్నాట్ ప్లేస్ లాంటి రద్దీ ప్రాంతాల్లో నిరసనలు చేపట్టడం వల్ల స్థానిక వ్యాపారులు భారీగా నష్టపోతున్నారని, పోలీసు సిబ్బందితో ఆందోళనకారులు దురుసుగా ప్రవర్తించడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, అదే స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే శక్తులను ఎదుర్కొంటామని నేతలు పేర్కొన్నారు. ఇకపై ప్రజలు కేవలం సోషల్ మీడియాలో చర్చలకే పరిమితం కాకుండా, దేశ ప్రయోజనాల కోసం బహిరంగంగా వీధుల్లోకి రావాలని ఈ సందర్భంగా లాల్ హిత్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ‘లాల్ హిట్ జనతా పార్టీ’ నాయకులు కేవలం నిరసనలను వ్యతిరేకించడమే కాకుండా, భవిష్యత్ కార్యాచరణపైనా స్పష్టతనిచ్చారు.
రాజ్యాంగ సంస్థలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు రానున్న రోజుల్లో ఢిల్లీ వ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే శక్తుల ఆటలు సాగనివ్వమని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడమే తమ పార్టీ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ప్రమేయం ఏమైనా ఉందా? ‘ముల్లును ముల్లుతోనే తీయాలి’ అన్న చందంగా సీజేపీ ఆగడాలను అరికట్టేందుకు ‘లాల్ హిట్’ను రంగంలోకి దింపిందా? అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


