రాష్ట్రమంతా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటుంటే జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున ఒక యువకుడు కత్తిపోట్లకు గురై మరణించిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రెండు కుటుంబాలు బతుకుదెరువు నిమిత్తం జగిత్యాల జిల్లాకు వలస వచ్చాయి. అందులో సంతోష్ అనే యువకుడి కుటుంబం ధర్మారంలో అద్దె ఇంట్లో నివాసముంటుండగా, అనిల్ అనే యువకుడి కుటుంబం రాజారాంపల్లిలో ఉంటోంది. ఇక మృతుడు సంతోష్ ధర్మారంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడని తెలుస్తుంది.
అయితే గత కొంతకాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం.. ఈ క్రమంలో ధర్మారంలో ఉంటున్న సంతోష్, అర్ధరాత్రి దాటిన తర్వాత రాజారాంపల్లికి రాగా.. ఆ సమయంలో అనిల్, సంతోష్ మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తుంది. ఆ సమయంలో విచక్షణ కోల్పోయిన అనిల్, సంతోష్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందినట్టు సమాచారం.
ఇక ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న వెల్గటూర్ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే ఈ హత్యకు సంబంధించి పూర్తి కారణాలు ఇంకా వెలుగులోకి రావలసి ఉంది. ఇక పండగ పుట ఊరంత సంబరాలు చేసుకుంటుంటే ఈ ఘనట రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పాత కక్షలు మనసులో పెట్టుకుని ఆలోచన కోల్పోవడం వల్ల ఒకరి ప్రాణం గాల్లో కాలసిపోగా.. మరొకరిని జైలు పాలు చేసింది..


