దేశ రాజకీయాల్లో ముస్లిం ప్రాధాన్యంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండు నెలల ముందుగానే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్టు తెలుస్తోంది. యూపీలో ముస్లిం ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ఒవైసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.దేశ రాజకీయాల్లో ముస్లింలు ఎవరికీ బానిసలు కాదని, సంప్రదాయ పార్టీల వెనుక నడవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు.
యూపీలోని రాంపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. తమకు నెహ్రూ, గాంధీ , యాదవ్ కుటుంబాల నాయకత్వం ఇకపై అవసరం లేదన్నారు. ముస్లిం సమాజం నుంచి స్వయంగా నాయకులు ఎదుగుతారని పేర్కొన్నారు. ఇంకెన్నాళ్లు ఇతర పార్టీల నాయకుల వెనుక తిరుగుతారని ప్రశ్నించారు. సంప్రదాయ లీడర్లను నెహ్రూ, గాంధీలుగా భావించి మద్దతు ఇవ్వాలని కొందరు మనవారే చెబుతున్నారని, ‘అలాంటి వారికి, ఒవైసీకి ఉన్న తేడా ఇదే. వాళ్లు ఇతరులను సమర్థించమంటారు. కానీ నేను మాత్రం మీరే నాయకులు కండి అంటాను’ అని అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు.
ముస్లిం యువతీయువకులకు ఇతర వర్గాల వారితో సమానంగా అపారమైన సామర్థ్యం, ప్రతిభ ఉందన్నారు.ప్రధాన రాజకీయ పార్టీలు వారిని కేవలం ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నాయని, సరైన వేదిక కల్పించడం లేదని అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అణగారిన వర్గాల గొంతు వినిపించేందుకు, ముస్లిం యువతకు రాజకీయ వేదికను అందించేందుకే తమ పార్టీ నిరంతరం పనిచేస్తూనే ఉందన్నారు. యువత ఎవరిపై ఆధారపడకుండా తమ సొంత నాయకత్వాన్ని నిర్మించుకోవాలని ఈ సందర్బంగా ఆయన పిలుపునిచ్చారు. దేశంలో కొన్నేండ్లు పాలించిన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలను ఉద్దేశించి ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.


