రాష్ట్రంలో వేసవి రాకముందే కరెంట్ కోతలు ప్రారంభం అయ్యాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పవర్ తీసేస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు.కరెంట్ కోతల కారణంగా ముఖ్యంగా వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఇయర్ ఎండ్ కావడంతో పెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేసేందుకు టార్గెట్లు ఇస్తున్నారని, వాటిని పూర్తి చేద్దామంటే ఇష్టానుసారంగా కరెంట్ కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాల సీజన్ పూర్తిగా ముగియక ముందే ఇలా అప్రకటితంగా కోతలు పెడితే సమ్మర్‌లో ఎలా ఉంటుందో అని ఇప్పటినుంచే టెకీలు ఆందోళన చెందుతున్నారు. అసలే ఐటీ సెక్టార్‌లో పరిస్థితులు బాలేవని, చిన్న చిన్న కారణాలు, కాస్ట్ కటింగ్, ఏఐ అప్‌గ్రేడ్, స్కిల్ అప్టేట్ చేసుకోలేదని ఉద్యోగాలు తీసేస్తున్న సమయంలో ఇలా కరెంట్ కోతలు పెడితే టార్గెట్ రీచ్ కాలేదని, ఇన్ టైంలో పెండింగ్ వర్క్స్ క్లియర్ చేయలేదని తమ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉందని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆవేదన చెందుతున్నారు.
హైదారాబాద్‌లో పవర్ కట్..
నగరంలో కరెంట్ కోతలు మొదలు కావడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగుల పనులు విద్యుత్ అంతరాయం వలన నిలిచిపోతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. నిన్న మాదాపూర్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిచినట్టు తెలిసింది. కరెంట్ పోగానే వైఫై రూటర్లు బంద్ కావడం, మొబైల్ నెట్‌వర్క్ సమస్యల వలన మధ్యలోనే ఆన్‌లైన్ మీటింగ్‌లు నిలిచిపోతున్నాయి.
దీంతో ప్రాజెక్టుల గడువులు, విదేశీ క్లయింట్ల సమావేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, కొండాపూర్, మణికొండలో విద్యుత్ కోతలపై వరుసగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. షేక్‌పేట లక్ష్మణ్‌నగర్‌లో పదేపదే విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నట్టు కంప్లయింట్స్ వస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ఉద్యోగుల ఆరోపిస్తున్నారు.సమస్య పరిష్కారం కోసం కాల్ చేస్తే సమాధానం ఉండటం లేదని, ఏఐ సమాధానాలే వస్తున్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేవలం గ్రేటర్ హైదరాబాద్‌లో 4 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఫీడర్లు ట్రిప్ కావడం, డీటీఆర్‌లలో సమస్యలు, నిర్వహణ లోపాలతో అంతరాయాలు మరింత ముదురుతున్నాయి.విద్యుత్ కోతలు లేవని, సాంకేతిక సమస్యలు తలెత్తితే సరఫరాను పునరుద్ధరిస్తున్నామని గతంలో సీఎండీ జితేశ్ పాటిల్ పేర్కొన్నారు. కానీ, అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండటం లేదని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. గ్లోబల్ సిటీ హైదరాబాద్‌లో నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని, లేదంటే తమ ఉద్యోగాలు పోవడం ఖాయమని, అప్పుడు ఎవరూ తమకు భరోసా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కోతలు..
ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు లేక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.పగటి పూట పొడి వాతవరణం ఉండటం, ఎండలు దంచికొడుతుండటంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఆఫీసుల్లోనూ ఏసీల వినియోగం పెరిగిందని, సాగు కోసం నీళ్లు లేకపోవడంతో బావుల్లోని నీటి మళ్లించేందుకు రైతులు మోటార్లు ఆన్ చేస్తుండటం వలన విద్యుత్ డిమాండ్‌కు తగట్టు సప్లయ్ ఉండటం లేదని సమాచారం. దీంతో విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
గరిష్టాలను తాకిన విద్యుత్ డిమాండ్..
గతంతో పోలిస్తే రాష్ట్రంలో భారీగా విద్యుత్ డిమాండ్ నెలకొంది. 15 అక్టోబర్ 2026 ఉదయం 10:29 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 20,003 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైందనిఅధికారులు స్పష్టంచేశారు. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 18,548 మెగావాట్లతో పోలిస్తే ఈసారి 1,455 మెగావాట్లు అధికంగా పెరిగిందని తెలిపారు. అదే రోజున రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 334.54 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు.
వ్యవసాయ మోటార్లు, గృహావసరాలు, వాణిజ్య, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం పెరగడం, అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా ఏసీల వాడకం పెరగడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్టోబర్ 15న సాయంత్రం 6:19 గంటలకు 4,220 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైనట్టు తెలిసింది. గతఏడాది ఇదే సమయంలో ఈ ఫిగర్ 3,552 మెగావాట్లు మాత్రమే ఉంది.


