తెలంగాణలో మరో కుంభకోణానికి సర్కార్ తెరలేపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది వర్షాకాలంలో సమృద్ధిగా వానలు పడలేదు. 17 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో 325కు పైగా మండలాల్లో తీవ్ర కరువు సంభవించింది. చెరువులు,కుంటలు ఎండిపోయాయి. సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బంది వచ్చి పడింది. ఓవైపు సాగు నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో అన్నదాత రోడ్డెక్కి ఆందోళనల బాటపట్టాడు. సాగుకు నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
మరోవైపు సర్కార్ మాత్రం మున్ముందు ఇంకా కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంందని.. అందుకే ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఎల్నినో మీద అత్యవసర సమావేశం నిర్వహించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. యాసంగి సీజన్ పంట వేయొద్దని, క్రాప్ హాలిడే పాటించాలని రైతాంగాన్ని కోరారు. ప్రాజెక్టుల్లో తాగు నీటికి మాత్రమే సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని, సాగుకు నీరిస్తే తాగుకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు.కరువు మండలాలకు సాయం చేసేందుకు కేంద్రం సాయం కోరతామన్నారు. పంటనష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం అందిస్తామన్నారు.
రూ.133 కోట్ల భారీ స్కామ్?
ఇదిలాఉండగా, రాష్ట్రంలో నీళ్లు లేక చెరువులు ఎండిపోతుంటే అందులో చేప పిల్లలు వదిలేందుకు సర్కార్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఎండిన చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కోసం రూ.133 కోట్ల ప్రజాధనం వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా నిబంధనల ప్రకారం నీటి నిల్వలు 50 శాతం ఉండి, 6 నెలల పాటు నీటి నిల్వ ఉంటేనే చేప పిల్లలు విడుదల చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఈసారి 17,677 చెరువుల్లో దాదాపు 13 వేల చెరువులు ఎండిపోయినా చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ సిద్ధం అవుతుండటంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేప పిల్లల పంపిణీ పేరిట మరో కుంభకోణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రచారం జరుగుతోంది.కాంట్రాక్టర్ల ఒత్తిడి మేరకు 50 శాతం నీటి నిల్వలు ఉండాలనే నిబంధనను 33 శాతానికి తగ్గిస్తూ మత్స్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
కాగా, కాంట్రాక్టర్ల లాభాల కోసం ఎండిపోయిన చెరువుల్లోకి చేప పిల్లల విడుదలకు రూ.133 కోట్ల ప్రజాధనం వృథా చేయడం ఏంటని మత్స్యకారులు మండిపడుతున్నారు. నీళ్లు లేని చెరువుల్లో చేప పిల్లలు వేస్తే అవి బతుకుతాయా? అని ప్రశ్నిస్తున్నారు. అటు నిధులు, ఇటు తమ కష్టం కూడా వృథా అవుతుందని చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.


