Honey Trap: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసును పోలీసులు ఛేదించారు. మహిళ పేరుతో పోలీస్ అధికారినే హనీ ట్రాప్ చేసిన కేటుగాడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పవన్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను చార్మినార్ డీసీపీ కిరణ్ వెల్లడించారు. నిందితుడు పవన్ మహిళగా పోలీస్ అధికారితో పరిచయం చేసుకున్నాడని.. చాటింగ్ ద్వారా మరింత దగ్గరయ్యాడని.. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడని తెలిపారు.
వందల మంది బాధితులు
దీని గురించి తమకు సమాచారం అందిన వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నామని డీసీపీ చెప్పారు. విచారణలో షాకింగ్ విషయాలు కనుగొన్నామన్నారు. నిందితుడి జాబితాలో వందల మంది బాధితులు ఉన్నారని, వేలాది వాట్సప్ చాటింగ్‌లు వెలుగులోకి వచ్చాయన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హనీట్రాప్ బాధితులు ఉన్నారని గుర్తించామన్నారు. దుబాయ్ వంటి విదేశాల్లో ఉన్నవారు సైతం పవన్ చేతిలో మోసపోయినట్లు డీసీపీ కిరణ్ పేర్కొన్నారు.
మహిళ పేరుతో పరిచయం
నిందితుడి పేరు కొండబత్తుల పవన్ కుమార్, వయసు 23ఏళ్లు. కూకట్ పల్లిలో నివాసం ఉంటాడు. మహిళ పేరుతో పరిచయం చేసుకోవడం, చాటింగ్ ద్వారా దగ్గరవడం, ట్రాప్ లో పడ్డారని తెలిశాక డబ్బులు డిమాండ్ చేయడం నిందితుడి నైజం అని పోలీసులు చెప్పారు. పవన్ నుంచి 20 లక్షల రూపాయలకుపైగా డబ్బుతో పాటు మూడు ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.
ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్
హనీ ట్రాప్ వ్యవహారాల్లో పవన్ సిద్ధహస్తుడు. అతడి కన్నింగ్ బుద్ధికి పోలీసులే విస్తుపోతున్నారు. అమ్మాయిల పేర్లతో ఫేక్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు తెరిచి యువకులతో పరిచయాలు పెంచుకుని, చాటింగ్ చేస్తాడు. కవ్వించే మాటలతో వారిని రెచ్చగొడతాడు. తన ట్రాప్ లో పడేసుకుంటాడు. ఆ తర్వాత వారి ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సేకరించి వాటి ద్వారా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తాడీ కేటుగాడు.
27 ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు
పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పవన్ హనీట్రాప్‌కు పాల్పడ్డాడు. వెయ్యి మందికి పైగా వ్యక్తులతో ఈ కేటుగాడు చాటింగ్ చేశాడని, సుమారు 100మంది వరకు అతడి ట్రాప్ లో చిక్కారని పోలీసులు చెప్పారు. మొత్తం 14 ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లు, 13 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలతో ఈ మోసాలకు పాల్పడ్డాడు.
డిప్లొమా సెకండియర్ డ్రాపౌట్
నిందితుడు పవన్ సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కాలేజీలో డిప్లొమా చదివే వాడని, సెకండియర్ లో డ్రాపౌట్ అయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే, తాను డిప్లొమా పాస్ అయ్యానని.. మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ చదువుతున్నానని తన కుటుంబసభ్యులకు, ఫ్రెండ్స్ కు పవన్ అబద్ధం చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉంటూ గత నాలుగేళ్లుగా పవన్ హనీ ట్రాప్ మోసాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు.
బాధితుల్లో విదేశీయులు కూడా
హనీట్రాప్ ద్వారా పవన్ ఇప్పటివరకు రూ.18 లక్షలు వసూలు చేశాడని పోలీసులు కనుగొన్నారు. అంతేకాదు పెట్టుబడులపై లాభాల పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల నుంచి మరో 7 లక్షల మోసానికి పాల్పడ్డాడు. పవన్ మామూలోడు కాదని, మహా కేటుగాడని పోలీసులు చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో హనీ ట్రాప్ కు పాల్పడినట్లు గుర్తించారు. తెలంగాణతో పాటు ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో పవన్ బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు దుబాయ్, టర్కీ, పాకిస్థాన్, కెనడాకు చెందిన వారు కూడా పవన్ ట్రాప్ కు చిక్కారని తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. పవన్ బాధితుల్లో వ్యాపారులు, డాక్టర్లు, లెక్చరర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, గిగ్ వర్కర్లు ఉన్నట్లు గుర్తించారు.
సోషల్ మీడియాతో జాగ్రత్త..
సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం మంచిది కాదన్నారు. కొందరు కేటుగాళ్లు అమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అబ్బాయిలకు వల వేసి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులు యాక్సెప్ట్ చేయకపోవడమే మంచిదని సూచించారు. ముక్కు మొహం తెలియని వారితో పరిచయాలు, చాటింగ్స్ వెరీ డేంజరస్ అని, భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


