రాజకీయాలు చేయడం అందరికీ రాదు అని అంటారు. కానీ కొందరు రాజకీయం చేస్తే అదో ప్రత్యేకత కనిపిస్తుంది. అలాంటి వారు ప్రత్యేకమైన రాజకీయనేతలుగా గుర్తింపు పొందుతారు.. అలాంటి వారిలో తన్నీరు హరీష్ రావు ఒకరిగా పొలిటికల్ సర్కిల్లో చెప్పుకుంటారు.. కేసీఆర్ కు నమ్మిన బంటుగా.. సిద్దిపేట టైగర్ గా ఆయనకు రాజకీయాల్లో పేరు ఉంది. అలాగే ఎన్నికల వ్యూహాలు, ప్రత్యర్థులపై పదునైన విమర్శలు, పార్టీ శ్రేణులను సమన్వయం చేసే తీరులో తన మార్క్ ఎప్పుడు ప్రత్యేకమే అంటారు.
కేసీఆర్ సైన్యంలో ఒక బలమైన నాయకుడు.. మామకు తగ్గ అల్లుడని గుర్తింపు పొందిన హరీశ్ రావు.. ఇప్పుడు అదే రాజకీయ అస్త్రాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రయోగిస్తున్నారు కానీ అవి మిస్ ఫైర్ అవుతుండటంతో అప్పుడప్పుడు అసహనంతో ప్రవర్తిస్తుండటం కనిపిస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్-బీఆర్ఎస్ అనే కవలలు రాష్ట్రాన్ని పాలించిన సమయంలో అధికారంలో ఉన్నది వీళ్ళే.. ఆ సమయంలో ఏపీ నేతలపై నెగెటివ్ విమర్శలతో, పదునైన పంచులతో ప్రజలను ఆకట్టుకుని ఫాలోయింగ్ పెంచుకున్నారు.
అసలు ఆంధ్ర రాజకీయాల వల్లే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, మన నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు వాళ్ళు దోచుకుపోతున్నారని అందుకే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖచ్చితంగా అవసరమనే వాదనను ఎత్తుకున్నారు. కానీ అప్పుడు ఇప్పుడు వీళ్ళ బిజినెస్ పార్ట్నర్ లు వాళ్ళే అది వేరే విషయం.. ఎందుకంటే ఇది రహస్య వ్యాపారం కాబట్టి ఈ నిజాలు జనానికి చెప్పరు.. ఇక ఆంధ్ర రాజకీయాలతో తెలంగాణ నాశనం అవుతుంది కాబట్టి.. కేసీఆర్ రాష్ట్రాన్ని పాలిస్తే తెలంగాణ మరో ఫారిన్ అయ్యి రాష్ట్ర అభివృద్ధి రాకెట్ కంటే వేగంగా జరుగుతుందనే పనికిమాలిన మాటలు చెప్పి అమాయకులను ఉద్యమాలకు బలి చేశారనే తీవ్ర విమర్శలున్నాయి.
తిట్లు, ఆరోపణలు ఇలాంటి వాటిని పట్టించుకుంటే రాజకీయ నాయకుడు అవ్వలేరని ఒక నానుడి ఉంది. దీన్ని ఒంటబట్టించుకున్న వారీగా బీఆర్ఎస్ దొరలకు పేరుంది. ఇప్పటికీ పదవులు లేకున్నా పవర్ లో ఉన్నట్టే ఫీలవడం బీఆర్ఎస్ అధినేతలకు కొత్తేం కాదని అనుకుంటారు.. అయితే ఇప్పుడు హరీష్ రావుకు వచ్చిన సమస్య ఏంటంటే.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలకు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి చేస్తున్న విమర్శలకు మధ్య అస్సలు పొంతన లేకుండ మాట్లాడటం..
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కేసీఆర్‌తో కలిసి పనిచేసిన హరీశ్ రావు.. క్రమక్రమంగా పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సిద్ధిపేటలో వరుస విజయాలు, తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర, సాగునీటి శాఖ మంత్రిగా బాధ్యతలు.. ఇవన్నీ ఆయన రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ఘట్టాలుగా నిలిచాయి. అలాగే పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ, ఎన్నికల ప్రచారంలోనూ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి, ఆయన పట్ల అభిమానం ఏర్పడింది. అందుకే రాజకీయ వర్గాల్లో ఆయనను ట్రబుల్షూటర్గా అభివర్ణిస్తుంటారు.
ఇదంతా ఒకవైపు అయితే బీఆర్ఎస్ తన పదేళ్ల పాలనలో రైతుబంధు, రైతుబీమా, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను తన విజయాలుగా ప్రచారం చేసుకుంది. రైతులకు మేలు జరిగిందని బీఆర్ఎస్ చెబుతుంటే, ఆ పథకాల అమలు, ప్రాజెక్టుల వ్యయం, అప్పుల భారం, సాగునీటి నిర్వహణ వంటి అంశాలపై ఆ సమయంలో ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తాయి. అప్పుడు అధికార పార్టీ నేతలు పొంతన లేని సమాధానాలు చెబుతూ తప్పించుకున్నారనే విమర్శలున్నాయి.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. హరీశ్ రావు అదే రైతు సమస్యలను ముందుకు తెస్తున్నారు. రైతులకు నీళ్లు అందడం లేదని, రైతుభరోసా వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతోందని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అదీగాక 2026 అక్టోబరులో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడమే కాకుండా.. కాళేశ్వరం, కల్వకుర్తి, దేవాదుల వంటి ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని కూడా ఆరోపించారు.
అయితే రైతుల సమస్యలపై ప్రశ్నించడం తప్పు కాదు. అది ప్రతిపక్షం బాధ్యత కూడా. కానీ ప్రశ్నించే ముందు తమ గత పదేళ్ళ పాలనకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి కదా అనే ప్రశ్నలు పుడుతున్నాయి.. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో రైతుల సమస్యలన్నీ పరిష్కారమయ్యాయా? సాగునీటి ప్రాజెక్టులు అనుకున్న లక్ష్యాలను చేరుకున్నాయా? రైతుల ఆదాయం, పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ ఖర్చులు, వ్యవసాయ కార్మికుల పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందా? అనే సమస్యలను బేరీజు వేసుకుని హరీష్ మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లకు చేరువవుతున్న సమయంలో.. హామీల అమలు, వ్యవసాయం, విద్యుత్, సాగునీరు వంటి అంశాలపై విమర్శలు రావడం సహజం. ఆ విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. అయితే ఇటీవల తెలంగాణలో కృత్రిమ కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, నదుల్లో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పంపులు పూర్తిస్థాయిలో నడపడం లేదని హరీశ్ రావు ఆరోపించారు.
విద్యుత్ సరఫరా, బొగ్గు నిల్వలు, ముందస్తు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, రైతులకు అందాల్సిన ఆర్థిక సహాయం వంటి అంశాలపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇక్కడే హరీశ్ రావు రాజకీయ పరిణితి కోల్పోయిన నాయకుడిగా ప్రవర్తించాడానే విమర్శలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే క్రమంలో, గత బీఆర్ఎస్ పాలనలోని లోపాలను విస్మరిస్తున్నాడు అనే ఆరోపణలు పుడుతున్నాయి.
రైతులకు అన్యాయం జరిగితే అది ఏ ప్రభుత్వం చేసినా తప్పే అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఒక వాదన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో వాదన తెస్తున్న హరీష్ రావు రాజకీయం తెలంగాణ ప్రజలకు ఏవగింపు కలిగిస్తుందని అంటున్నారు.. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్‌ను ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్కు ఉంది. కానీ తమ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీల అమలు, వాటి ఫలితాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ అప్పులు, పూర్తికాని పనులపై సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా బీఆర్ఎస్ కు ఉందనే విషయాన్ని హరీష్ రావు మరచిపోవడం విడ్డూరమని అంటున్నారు..
ఒక పార్టీ వైఫల్యం మరో పార్టీకి క్లీన్చిట్ ఇవ్వదు. కాంగ్రెస్ తప్పు చేస్తే బీఆర్ఎస్ గత తప్పులు మాయమైపోవు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలున్నాయని కాంగ్రెస్‌కు ప్రస్తుత బాధ్యతల నుంచి మినహాయింపు లభించదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేసిన పార్టీలే ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతాయని కొన్ని అనుభవాలు చెబుతున్నాయి. ఇక హరీశ్ రావు రాజకీయంగా తెలివైన నాయకుడు కావచ్చు..
ప్రత్యర్థులను ఇరుకున పెట్టడంలో అనుభవం ఉండవచ్చు. కానీ ఆ నైపుణ్యం ప్రజల సమస్యలకు పరిష్కారంగా మారినప్పుడే దానికి నిజమైన విలువ ఉంటుంది. లేదంటే రాజకీయ చతురత కేవలం అధికార పోరాటానికి ఉపయోగపడుతుంది కానీ ప్రజల మేలుకు ఉపయోగపడదని చెబుతారు. మరోవైపు ఇటీవల కాలంలో పలు అంశాల మీద హరీష్ చేస్తున్న వ్యాఖ్యలు.. వినిపిస్తున్న వాదనలు ఆయన మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేలా చేస్తున్నాయన్న విమర్శ బలంగా వినిపిస్తుంది.
ముఖ్యంగా పండగ సమయంలో TSRTC దోపిడికి తెగబడుతుందని ప్రయాణికులను నిలువుగా దోచుకుంటుందని ఈ ట్రబుల్ షూటర్ గొంతెత్తి ప్రచారం చేయడం నవ్వు తెప్పిస్తుందని అంటున్నారు. పండుగ వేళల్లో ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయటం ఎప్పటి నుంచో వస్తున్నదే. కేసీఆర్ పదేళ్ల పాలనలో సైతం ఇదే నియమాన్ని పాటించారు. ఆ విషయాల్ని గాలికి వదిలేసిన హరీశ్ రావు..
దసరా పండుగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో పెంచిన టికెట్ ధరల మీద విమర్శలతో విరుచుకుపడటం చూస్తే.. అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అదనపు ఛార్జీల బాదుడు మీద హరీశ్ స్పందించింది లేదు. అలాంటి ఆయనకు ఇప్పుడు సడెన్ గా జ్ఞానోదయం అయ్యిందా? అని అంటున్నారు జనం.. ఆర్టీసీ బస్సుల్లో భార్యకు ఉచిత ప్రయాణమని చెప్పి.. భర్తకు డబుల్ చార్జీ వసూలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్న హరీశ్ రావు.. నీ మామ ఇదే పండుగ సమయంలో కార్మికులు చేస్తున్న స్ట్రైక్ ను చర్చల ద్వారా పరిష్కరించి ఆదాయాన్ని సమకూర్చలేక పోయారు..
ఫలితంగా ఎంత నష్టం జరిగిందో నువ్వు మరచిన జనం మరచిపోలేదని అంటున్నారు.. మరోవైపు తెలంగాణ ఆర్టీసీ (TSRTC) చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టంగా నిలిచిపోయిన ఘటన.. 2019 అక్టోబర్ దసరా పండుగ సమయంలో జరిగిన 52 రోజుల సుదీర్ఘ సమ్మె.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (JAC) పిలుపునిచ్చిన ఈ సమ్మె.. అటు సంస్థకు కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని మిగిల్చడమే కాకుండా, ఇటు సామాన్య ప్రయాణికుల నడ్డి విరిచిందనే తీవ్ర ఆరోపణలు మూట గట్టుకుంది.
తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగల రోజే అంటే అక్టోబర్ 5, 2019 అర్ధరాత్రి నుండి ఈ సమ్మె ప్రారంభమైంది. దాదాపు 10,000 పైగా బస్సులు డిపోలకే పరిమితం కావడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకున్న లక్షలాది మంది ప్రయాణికులు బస్టాండ్లలో గంటల తరబడి నిరీక్షించారు. అప్పటి ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, ప్రైవేట్ బస్సులతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ.. రద్దీకి సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడిన బాధలు వర్ణాతీతం.. ఇక ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ ట్రావెల్స్, ఆటోలు, ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుండి మూడింతలు, నాలిగింతలు అదనపు ఛార్జీలు వసూలు చేసి నిలువుదోపిడీకి పాల్పడ్డారనే విషయం గుర్తుందా హరీష్..
సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పండుగ సీజన్లలోనే ఆర్టీసీకి అత్యధిక ఆదాయం లభిస్తుంది. అయితే పండుగ రోజే సమ్మె ప్రారంభం కావడం వల్ల అప్పటి లెక్కల ప్రకారం.. రోజుకు సగటున రూ. 11 కోట్ల నుండి రూ. 12 కోట్ల వరకు ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోవాల్సి వచ్చింది. 52 రోజుల సమ్మె కాలంలో దాదాపు రూ. 700 కోట్ల నుండి రూ. 800 కోట్ల వరకు ప్రత్యక్ష, పరోక్ష నష్టం వాటిల్లిందని అప్పట్లో అంచనా వేశారు. ఈ నష్టం సంస్థను మరింత అప్పుల ఊబిలోకి నెట్టివేసిందనే ఆరోపణలున్నాయి.
అప్పటివరకు నియంతృత్వ పాలన చేసిన కేసీఆర్ భారీ నష్టం జరిగాక సమ్మె విరమణకు చర్యలు చేపట్టడం విడ్డూరం.. అయితే ఆర్టీసీని నష్టాల నుండి గట్టెక్కించేందుకు ఒకేసారి కిలోమీటరుకు 20 పైసల చొప్పున బస్సు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2019 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఛార్జీల పెంపు ఫలితంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్రయాణించే గ్రామీణ, సామాన్య ప్రయాణికులకు టికెట్ ధరలు రూ. 5 నుండి రూ. 30 వరకు పెరిగాయి.
అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు, రోజువారీ ఉద్యోగులు కొనుగోలు చేసే సిటీ గ్రేటర్ పాస్‌లు, సాధారణ బస్ పాస్‌ల ధరలను కూడా ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్యుల నెలవారీ బడ్జెట్ తలకిందులైంది. కార్మికుల డిమాండ్ల సాధన కోసం జరిగిన ఆర్టీసీ సమ్మె.. చివరకు సంస్థకు భారీ ఆదాయ గండిని కొట్టడమే కాకుండా, ఆ నష్టాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం తీసుకున్న ఛార్జీల పెంపు నిర్ణయంతో సామాన్య ప్రయాణికుడిపై మోయలేని ఆర్థిక భారాన్ని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మోపింది
ఆ ఫలితమే ఇప్పుడు అధిక చార్జీల పెరుగుదలకు కారణమైందని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదని జనం భావిస్తున్నారు. ఇక హరీష్ రావు మరొక విషయం మరచినట్టు ఉన్నారు.. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా టికెట్ ధరల నియంత్రణ నిర్ణయం 2003 నుంచి అమలు అవుతున్నదే. సంస్థపై అదనపు భారం పడకుండా రూల్స్ కు అనుగుణంగానే ఆర్టీసీ ఈ పద్దతిని ఫాలో అవుతుందన్నట్టు గుర్తించక పోతే ఎలా?
సాధారణంగా.. పండుగల సమయంలో బస్సులు వెళ్లేటప్పుడు వంద శాతానికి మించి ఆక్యుపెన్సీ ఉన్నప్పటికి.. తిరుగు ప్రయాణంలో దాదాపుగా ఖాళీగా బస్సులు రావాల్సి ఉంటుంది.ఇలా ఒకటిన్నర రెట్లు అధికంగా టికెట్లు అమ్మకపోతే..పండుగ వేళలో ఆర్టీకి భారీగానష్టపోతుందన్నది అందరికి తెలిసిన నిజం. కానీ.. ఆ విషయాల్ని వదిలేసి.. తమ ప్రభుత్వంలోనూ అమలు చేసిన విధానాన్ని తాజాగా హరీష్ రావు తప్పు పట్టటం.. విమర్శలు గుప్పించటం లాంటివి ఆయన మీద ఉన్న గౌరవాన్ని.. ఆయన మాటకు ఉండే విలువను తగ్గిస్తాయన్న విషయాన్ని ఆయన ఎప్పుడు గుర్తిస్తారో? అని జనం చర్చించుకుంటున్నారు.
ఇలాంటి చిల్లర రాజకీయాలు జనాలను పిచ్చోళ్ళను చేయడానికి కాకపోతే మరేందుకు అని ప్రశ్నిస్తున్నారు.. మొత్తానికి కేసీఆర్ మార్క్ రాజకీయాన్ని హరీశ్ రావు దాటేసి అబద్ధాలలో పీహెచ్డీ చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలు పలు విమర్శలు అందుకుంటున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేల కోట్ల ఆస్తులు రాజకీయ నేతల గుప్పిట్లోకి వెళ్ళాయి.
ఒక వేళ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉంటే నేతల ఆస్తులు ఎలా పెరిగాయి? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పి.. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు, రాష్ట్ర ప్రజల బ్రతుకులు ఆర్థిక స్థిరత్వం వైపు నడిపించే నాయకులు కావాలి.. కానీ, అధికారం కోసం చిల్లర రాజకీయాలు చేసే వారు కాదని కొత్త తరం ఆశిస్తుంది. అలా కాకుండా ప్రతిసారీ ప్రత్యర్థిపై బురద చల్లడం.. ప్రతి సమస్యను రాజకీయ అస్త్రంగా మార్చడం.. ప్రతి వైఫల్యానికి గత ప్రభుత్వాన్నో, ప్రస్తుత ప్రభుత్వాన్నో కారణంగా చూపించడం..
ఈ పద్ధతులు ఎంతకాలం కొనసాగుతాయని ఆలోచించుకోవాలి.. ప్రజలకు కావాల్సింది కట్టుకథలు కాదు.. కళ్లముందు కనిపించే పారదర్శకమైన పాలన. ఆరోపణలు కాదు.. ఆధారాలు. హామీలు కాదు.. వాటి అమలు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కావాల్సింది మార్పని.. నిఖార్సైన నాయకుడని.. పదవుల కోసం ఊసరవెల్లి వేషాలు వేసే నాయకులు కాదని జనం అభిప్రాయపడుతున్నారు..
కాబట్టి హరీష్ రావు నువ్వు సంపాదించిన కాడికి చాలు.. ఇకనైన నీ ఆస్తులు పెంచుకునే రాజకీయాలు కాకుండా.. ప్రజలకు పనికి వచ్చే రాజకీయాలు చేయాలని రాష్ట్ర సాధనలో బలైన ఉద్యమకారుల ఆత్మలు ఘోషిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు..


