తెలంగాణ

TG: రేషన్ బియ్యంతో పాటు పప్పు, నూనె.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే కాకుండా, సామాన్యుల వంటింట్లో రోజూ వాడే నిత్యావసర సరుకులన్నింటినీ అందించే ఆలోచనలో సర్కార్ ఉంది.

TG: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే కాకుండా, సామాన్యుల వంటింట్లో రోజూ వాడే నిత్యావసర సరుకులన్నింటినీ అందించే ఆలోచనలో సర్కార్ ఉంది. మార్కెట్లో సరుకుల రేట్లు మండిపోతుండటంతో పేద కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చేందుకు బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె, గోధుమపిండి లాంటి సరుకులను రేషన్ ద్వారా పంచే విషయంపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఆఫీసర్లతో జరిపిన కీలక భేటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రేషన్ లబ్ధిదారులకు బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి సరుకులు ఇస్తే బాగుంటుందనే ప్రతిపాదనపై అధికారులతో ఆయన చర్చించారు. వీటిని సబ్సిడీ రేట్లకు పంపిణీ చేస్తే ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతుంది, సరుకుల కొనుగోలు ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపై సమగ్ర వివరాలతో ఫైల్ సిద్ధం చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆ రిపోర్ట్ రాగానే దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

14 నెలల తిండికి ఢోకా లేకుండా పక్కా ప్లాన్

మరోవైపు భవిష్యత్తులో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి పంటలు దెబ్బతిన్నా ప్రజలు ఇబ్బంది పడకూడదని మంత్రి ఉత్తమ్ అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థపై ఆధారపడి బతుకుతున్న 3.42 కోట్ల మంది పేదలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఏకంగా 14 నెలలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉండేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా పంపిణీ, హాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి కలిపి నెలకు 2.38 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన గోదాముల్లో ఉన్న నిల్వలు, మిల్లర్ల నుంచి రావాల్సిన సీఎంఆర్ బియ్యం కలిపితే దాదాపు 28.03 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు లెక్కలు చెప్పారు. ఈ స్టాక్ 2027 సెప్టెంబర్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరిపోతుందని వివరించారు. రాబోయే రోజుల్లో రేషన్ షాపుల ద్వారా ఈ నిత్యావసర సరుకుల పంపిణీ గనుక అమల్లోకి వస్తే పేద, మధ్యతరగతి ప్రజల జేబులపై నెలవారీ ఖర్చుల భారం బాగా తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.

#Telangana#Telangana Government#Uttam Kumar Reddy#Ration Cards#Ration Shops#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి