Godavari: గోదావరి నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నీటిని నిల్వ చేసే ప్రయత్నాల్లో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలు ఏర్పాటు చేసే పనులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద గోదావరి ఆనకట్టను మంత్రి తమ్మల పరిశీలించారు.
ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటే అవకాశం
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో తాగునీటి ఇబ్బందులు రాకుండా గోదావరి నీటిని నిల్వ చేసే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
వరి సాగు వద్దు
వర్షాలు తగ్గి భూగర్భజలాలు పడిపోయే పరిస్థితి ఏర్పడితే వ్యవసాయంతో పాటు తాగునీటి సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు మంత్రి తుమ్మల. మరోవైపు రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలన్నారు. నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం మేలని చెప్పారు. నీటి లభ్యత తగ్గితే విద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందనే విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలన్నారు. నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి తుమ్మల తేల్చి చెప్పారు.


