Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తనదైన శైలిలో సంచలన ప్రకటన చేసి అందరి బుర్రలను పాడుచేశారు. కార్పొరేట్ కంపెనీలు సమాజ సేవ పేరుతో నిధులను ఏవో ఫండ్స్‌కు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, నేరుగా సామాన్యులకే వాటాలు ఇచ్చేస్తే బాగుంటుందంటూ సరికొత్త ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని ప్రతి పిల్లాడికీ తన రాకెట్ కంపెనీ 'స్పేస్ఎక్స్' లో ఒక్కో షేరును పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
ఎందుకీ నిర్ణయం? మస్క్ ఏం చెప్పారంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థ 'ఆంథ్రోపిక్' ఇటీవల సమాజ హితం కోసం కంపెనీలో 5 శాతం వాటాలను ఒక ప్రత్యేక ఫండ్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై స్పందించిన మస్క్.. "వాటాలను ఏదో నిధికి చేర్చే బదులు, నేరుగా ప్రజలకే ఇచ్చేస్తే సరిపోతుంది కదా! భవిష్యత్తులో నేను కూడా ఇదే చేయబోతున్నా" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు. అన్నట్లుగానే వెంటనే మరో పోస్ట్ పెడుతూ.. వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని ప్రతి చిన్నారికీ స్పేస్ఎక్స్ కంపెనీ నుంచి తలో ఫ్రీ షేరు ఇస్తానని స్పష్టం చేశారు.
మొత్తం ఖర్చు చూస్తే మైండ్ బ్లాక్..
మార్కెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం స్పేస్ఎక్స్ ఒక్క షేరు విలువ 146.03 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 12 వేల పైనే) ఉంది. అమెరికా మొత్తం మీద 18 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు సుమారు 7.2 కోట్ల నుంచి 7.3 కోట్ల మంది దాకా ఉన్నారు. ఈ లెక్కన పిల్లలందరికీ ఒక్కో షేరు కేటాయించాలంటే మస్క్ ఇచ్చే ఈ ఫ్రీ ఆఫర్ మొత్తం విలువ ఏకంగా 10.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 88 వేల కోట్లకు పైగా) చేరుకుంటుంది. ట్రస్టులు, ఎన్జీవోల ద్వారా కాకుండా నేరుగా రాకెట్ కంపెనీ వాటాలనే పిల్లల చేతుల్లో పెట్టాలన్న మస్క్ ఆలోచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ షేర్లను పిల్లల పేరిట ఎలా బదిలీ చేస్తారు, అర్హులను ఎలా గుర్తిస్తారు అనే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.


