Bathukamma Celebrations: అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలోని ప్రతిష్టాత్మక 'కొమెరికా సెంటర్' వేదికగా 'టి-ప్యాడ్' (TPAD) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఏకంగా 15 వేల మందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు తరలిరావడంతో ప్రాంగణమంతా పండుగ శోభతో వెలిగిపోయింది. పొద్దున మొదలైన ఆటపాటలు రాత్రి దాకా నాన్‌స్టాప్‌గా సాగి ప్రతి ఒక్కరినీ అలరించాయి.
నవీన్ పోలిశెట్టి స్పెషల్ ఎంట్రీ.. ఫుల్ రచ్చ
ఈ వేడుకల్లో మెయిన్ హైలైట్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సందడే. అమెరికాలో ఇంత భారీ ఎత్తున బతుకమ్మ చేయడం చూసి ముగ్ధుడైన ఆయన, వేదికపైకి వచ్చి గంటపాటు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తన మార్క్ కామెడీ పంచ్‌లతో నవ్విస్తూనే, అక్కడున్న యూత్‌తో పాటు పిల్లలను కూడా స్టేజ్ మీదికి పిలిచి వారితో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. నవీన్ ఎనర్జీకి ఆడిటోరియం మొత్తం కేరింతలతో హోరెత్తిపోయింది.
భారీ బతుకమ్మ.. వెయ్యి మందితో ఆటలు
స్టేడియం మధ్యలో కొలువుదీరిన భారీ టవర్ తరహా బతుకమ్మ అందరినీ ఆకర్షించింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ దాదాపు వెయ్యి మందికి పైగా మహిళలు, యువతులు ఆ బతుకమ్మ చుట్టూ చేరి బతుకమ్మ ఆడటం కన్నులపండువగా నిలిచింది. అక్కడ సెల్ఫీలు దిగేందుకు సందర్శకులు పోటీపడ్డారు. అనంతరం పద్ధతి ప్రకారం నిమజ్జనం నిర్వహించగా, వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన 'మహిషాసుర మర్ధిని' నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది.
రాత్రి 11 దాకా మ్యూజికల్ నైట్
గాయకుడు కృష్ణ చైతన్య నేతృత్వంలోని ‘ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్’ లైవ్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు నవీన్ పోలిశెట్టి హంగామా, ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ పాటలు జోరుగా సాగాయి. ఒక తెలుగు సంస్థ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో ఓ సినీ నటుడు, మ్యూజిక్ టీమ్ ఇంతలా జనంలో కలిసిపోయి అలరించడం సరికొత్త అనుభూతిని ఇచ్చిందని హాజరైన ప్రవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ భారీ ఈవెంట్‌ను సక్సెస్ చేయడంలో టి-ప్యాడ్ ప్రెసిడెంట్ లక్ష్మి పోరెడ్డి, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి ఆల్వలతో పాటు 20 కమిటీల వాలంటీర్లు అహర్నిశలు కష్టపడ్డారు. పకడ్బందీ భద్రతా ఏర్పాట్లతో కార్యక్రమం సాఫీగా సాగడంతో సహకరించిన స్పాన్సర్లు, దాతలు, మీడియా ప్రతినిధులకు నిర్వాహక బృందం కృతజ్ఞతలు తెలిపింది.


