Neha Bhora: శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ముందస్తు నోటీసును సవాల్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. విచారణ కాలంలో ఎక్కడా గొడవలు జరగకుండా చూసేందుకు రూ.10,000 వ్యక్తిగత బాండ్‌తో పాటు ఒక పూచీదారుడిని సమర్పించాలంటూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటీసు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పోలీసులు పెట్టిన ఆంక్షలేంటంటే..
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నప్పటికీ ఆందోళనలు చేశారంటూ పోలీసులు ఈ చర్యలకు ఉపక్రమించారు. అక్టోబర్ 16న మందీ హౌస్ వద్ద నినాదాలు చేయడం, జంతర్ మంతర్ సమీపంలో నిరసనలకు దిగడం, కన్నాట్ ప్లేస్‌లో ఆందోళనకు పిలుపునిచ్చారన్న ఆరోపణలను నోటీసులో ప్రస్తావించారు. జెండా ప్రదర్శనలో పాల్గొన్నందుకు అంతకుముందే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సుమారు 12 గంటల పాటు నిర్బంధించి మరుసటి రోజు ఉదయం రిలీజ్ చేశారు. ఆ తర్వాత వెంటనే పూచీకత్తు సమర్పించాలంటూ ఈ నోటీసులు పంపారు.
ఆధారాలు లేకుండా నోటీసులా..
న్యాయవాది అభిక్ చిమ్నీ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో నేహా బోరా పోలీసుల వాదనలను తీవ్రంగా తప్పుబట్టారు. తాను శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాననే ఆరోపణకు పోలీసులు నోటీసులో ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. ఎప్పుడు, ఏ సందర్భంలో శాంతిభద్రతలకు భంగం కలుగుతుందో స్పష్టత ఇవ్వకుండా ఇలాంటి ఆంక్షలు విధించడం రాజ్యాంగంలోని 19 (భావవ్యక్తీకరణ స్వేచ్ఛ), 21 (వ్యక్తిగత స్వేచ్ఛ) అధికరణలను నేరుగా ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పారు. కన్నాట్ ప్లేస్ వద్ద ప్రజలను రెచ్చగొట్టానన్న పోలీసుల ఆరోపణల్లో నిజం లేదని, మందీ హౌస్ వద్ద శాంతియుతంగా సమావేశం కావాలని మాత్రమే కోరానని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టుకు సెలవులు ఉన్నప్పటికీ, నోటీసు ప్రాధాన్యత దృష్ట్యా ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని నేహా తరఫు న్యాయవాదులు కోరనున్నారు. నిరసన తెలిపే హక్కుపై పోలీసులు విధించే ఇలాంటి ముందస్తు ఆంక్షలపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.


