Elnino: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీరు, విద్యుత్ పొదుపు దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో నిర్మాణాల కోసం కొత్త బోర్లకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్ వాడకాన్ని తగ్గించాలంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
కొత్త బోర్ల తవ్వకానికి నో పర్మిషన్
హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలకు తప్ప నిర్మాణాలకు, ఇతర పనులకు కొత్త బోర్ల తవ్వకానికి అనుమతులు మంజూరు చేయవద్దని తేల్చి చెప్పారు. నగరంలో మున్సిపల్ నల్లా కనెక్షన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు హైడ్రా సహకారంతో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఇక నవంబర్ 1 నుంచి నిర్మాణాలకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని సప్లయ్ చేయనున్నట్లు ప్రకటించారు.
అత్యవసరమైతేనే ఏసీలు వాడాలి
అటు ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్ ను పొదుపుగా వాడాలని తేల్చి చెప్పారు. పగటి వేళల్లో అత్యవసరమైతేనే ఎయిర్ కండిషనర్లను (ఏసీ) వినియోగించాలన్నారు. అది కూడా 25 డిగ్రీల పరిమితిలో ఏసీలను వాడాలన్నారు. ఇక సాయంత్రం 6 గంటల తర్వాత ఏసీల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోయినా వ్యవసాయ, గృహ అవసరాలకు నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామన్నారు.
పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండవు
పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉండబోవని, యాజమాన్యాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అటు అన్ని థర్మల్ పవర్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఇక, ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తాగు నీరు, విద్యుత్ కొరత రాకుండా ప్రణాళికలు రూపొందించాలని సంజయ్ జాజు సూచించారు.


