తెలంగాణ

BRS-Congress: నాడు కేసీఆర్-నేడు రేవంత్ రెడ్డి.. రైతులు అంటే లెక్కలేదా?..

రచన: Venu•••12 నిమిషాల పఠనం

కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, రైతన్నలకు కొండంత ఆశలు చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ నేటికీ రేవంత్ రెడ్డి పాలనలోనూ రైతు బతుకులు ఏమీ మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ.. కోటి ఎకరాల మగాణి అని అంటారు. కానీ మాటల్లో ఉన్నది చేతల్లో లేదని ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల ఆస్తులు మాత్రం విపరీతంగా పెరగడం కనిపించింది. ఇంకా కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు మారాయి. నేతల ఆస్తులు పెరిగాయి.. కానీ, పొలంగట్లపై రైతన్న తలరాత మాత్రం మారడం లేదు.

నేతలు అధికారంలోకి రావడానికి ముందూ రైతులను ఓటు బ్యాంకుగా చూస్తూ హామీల వర్షం కురిపించడం.. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలికి వదిలేసి.. రైతు ప్రయోజనాలపై రాజకీయాలు చేయడం పరిపాటిగా మారింది. నాడు బిఆర్‌ఎస్, నేడు కాంగ్రెస్.. రెండు ప్రభుత్వాల హయాంలోనూ రైతాంగం ఎదుర్కొన్న ఇబ్బందులు, నెరవేరని హామీలు, వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్న విషయం తెలిసిందే..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, దాన్ని ఏకకాలంలో కాకుండా విడతల వారీగా అమలు చేసింది. అప్పటికే బ్యాంకు రుణాలపై వడ్డీలు పెరుగుతున్న రైతులకు రుణమాఫీ పూర్తయ్యేలోపు కొత్త పంట రుణాలు పొందడం సమస్యగా మారింది. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోయారనే ఆరోపణలున్నాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ, ఐదేళ్ల కాలంలో ఈ హామీని అరకొరగానే అమలు చేశారు. ఇక ఈ సమయంలో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి కొంత డబ్బు అందించినప్పటికీ, అది సాగు చేయని కొండలు, గుట్టలు, బీడు భూములకు అందిందని, కష్టపడి సేద్యం చేసే కౌలు రైతులకు మాత్రం పైసా సాయం అందలేదనే విమర్శలున్నాయి..

2020-21 కాలంలో కేంద్ర ప్రభుత్వంతో ధాన్యం కొనుగోళ్లపై సాగిన రాజకీయ పోరులో నష్టపోయింది సామాన్య రైతే. "ఒక్క గింజ కూడా కొనము" అని ఒకసారి, "కేంద్రం మెడలు వంచుతాం" అని మరొకసారి ప్రకటనలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు కాలయాపన చేశారు. ఇంతలో తుపానులు, వడగండ్ల వానల వల్ల ధాన్యం కల్లాల్లోనే తడిసి ముద్దయి రైతులు లక్షల్లో నష్టపోయారు.

ఇక 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షలాది ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇస్తామన్న హామీ పూర్తిస్థాయిలో నెరవేరలేదు. NCRB (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదికల ప్రకారం కేసీఆర్ హయాంలో వేలాది మంది రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. పోడు భూముల పోరాటాలు, కౌలు రైతుల సమస్యలు పట్టించుకోకపోవడం, రుణమాఫీని ఆలస్యం చేయడం వంటి ప్రభుత్వ నిర్లక్ష్యం కేసీఆర్ పాలనపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.

మరోవైపు 2022 మే 6వ తేదీన వరంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. అగ్రనేత రాహుల్‌ గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. రైతు డిక్లరేషన్‌ పేరుతో హామీలను ప్రకటించారు. తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే రైతులకు ఏదో చేస్తామని అరచేతిలో స్వర్గం చూపించారు. ఇలా 34 హామీలతో రైతు డిక్లరేషన్‌ను విడుదల చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధును రూ.15 వేలకు పెంచుతామని, ఏకాలంలో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వ్యవసాయ కూలీలకు కూడా రైతుభరోసా కింద ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని, రైతులు పండించిన ప్రతి పంటకూ మద్దతు ధరను పెంచి కొనుగోలు చేస్తామని, వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ చెల్లిస్తామని.. ఇలా అనేక హామీలు సభ వేదికగా గుప్పించారు.

ఇలా కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, రైతన్నలకు కొండంత ఆశలు చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ నేటికీ రేవంత్ రెడ్డి పాలనలోనూ రైతు బతుకులు ఏమీ మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే 2024 లో రేవంత్ సర్కార్ రూ. 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టినప్పటికీ, విధించిన ఆంక్షలు, నిబంధనలు లక్షలాది మంది రైతులకు శాపంగా మారాయి.

సగానికి పైగా రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదనే ఆరోపణలున్నాయి.. వరి మద్దతు ధరతో పాటు ఇస్తామన్న రూ.500 బోనస్ కేవలం సన్న వరి కి మాత్రమే పరిమితం చేసి, దొడ్డు వరి పండించిన మెజారిటీ రైతులను వంచించారనే నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక 2025 లో రైతుల పరిస్థితి మరింత దీయనీయంగా మారింది. కేవలం హామీలు విస్మరించడమే కాకుండా, సమయానికి సాగునీరు విడుదల చేయకపోవడం, బోర్లలో భూగర్భ జలాలు పడిపోవడంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.

ఎరువులు, విత్తనాల కోసం క్యూ లైన్లలో రైతులు గంటల తరబడి నిలబడే పాత రోజులు మళ్లీ వచ్చాయి. రైతు భరోసా సాయం సకాలంలో అందక విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందనే తీవ్ర ఆరోపణలు పుట్టాయి.. ఇక 2026లో రైతులు పడుతున్న గోసలు అందరికీ తెలిసిందే.. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లవుతున్నా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంపై వారి ఖాతాల్లో ఆర్థిక సాయం వేయడంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. నాడు కేసీఆర్ ఎలాగైతే కౌలు రైతులను విస్మరించారో, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోందనే ఆవేదన వ్యక్తమవుతోంది.

ఇక ధాన్యం కొనుగోళ్ల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో రాజకీయం చేస్తే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మునుపటి ప్రభుత్వం చేసిన అప్పుల నెపాన్ని చూపుతూ కాలయాపన చేస్తోంది. నాడు కేసీఆర్ అయినా, నేడు రేవంత్ రెడ్డి అయినా... ఇద్దరి లక్ష్యం ఎన్నికల సమయంలో రైతుల ఓట్లు పొందడమే గానీ, వారి శ్రమకు గుర్తింపు ఇచ్చి.. రైతును రాజును చేద్దామనే ఆలోచన ఆవగింజంత కూడా కనిపించడం లేదన్నది పచ్చి నిజంలా కనిపిస్తుంది.

మరోవైపు 2026 ఖరీఫ్ వ్యవసాయంపై వర్షాభావ పరిస్థితులు, తగ్గుతున్న భూగర్భ జలాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతాయనే ఆందోళనలు రైతాంగంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఎల్‌నినో ప్రభావంపై హెచ్చరికల నేపథ్యంలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, పంటల పరిరక్షణపై ముందస్తు ప్రణాళిక అవసరమైంది. అక్టోబర్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చే నెలల్లో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

అయితే ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం మాత్రమే సరిపోదు. రైతు వేసిన పంటకు నీరు అందివ్వడం.. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడటం. బోర్లు ఎండిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం. పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం.. నష్టపోయిన రైతుకు తదుపరి సాగుకు పెట్టుబడి విషయంలో పారదర్శకంగా వ్యవహరించడం.. వంటి చర్యలను క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఏమేరకు అమలు చేస్తుందన్నదే ప్రధాన ప్రశ్నలా మారింది.

అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్- కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, విద్యుత్తు, వ్యవసాయ నిర్వహణలో విఫలమైందని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కరువు పరిస్థితులు, వాతావరణ మార్పులు, నీటి కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నామని చెబుతోంది.. మరోవైపు కేసీఆర్ రైతుల పేరుతో రాజకీయాలు చేశారని నాడు కాంగ్రెస్ విమర్శించింది. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా రైతుల సమస్యలను సకాలంలో పరిష్కరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వాలు మారుతున్నాయి.. పాలకులు మారుతున్నారు.. కానీ రైతు సమస్యలు మాత్రం మళ్లీ మళ్లీ ఎందుకు తెరపైకి వస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాటి కేసీఆర్ ప్రభుత్వానికీ ఉంది.. నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికీ ఉంది. ప్రచారాల్లో మైకుల ముందు మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని అబద్దపు ప్రచారాలు చేసుకోవడం కాదు.. రైతు కన్నీళ్లు తుడిచినప్పుడే నిజమైన సంక్షేమం సాధించినట్లు.

ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత ప్రభుత్వ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇచ్చిన ప్రతీ హామీని షరతులు లేకుండా అమలు చేస్తూ, రైతులకు న్యాయం చేసి, వ్యవసాయాన్ని పండుగలా మార్చే దిశగా అడుగులు వేయాలి. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని మార్చడంలో తెలంగాణ ప్రజలు ఏ మాత్రం వెనుకాడరని మరోసారి నిరూపిస్తారనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి..

#Telangana Farmers Crisis#KCR Farmers Promises#Revanth Reddy Government#Telangana Agriculture News#Farmers Loan Waiver#Rythu Bharosa Scheme#Telangana Farmer Issues#Telangana Political Analysis
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి